How Banana Tree Waste Turns Into Eco Friendly Products : చెవి రింగులు, చెవి జోళ్లు, గాజులు, బుట్టలు, ప్లేట్లు, గ్లాసులు, పాదరక్షలు, డోర్ మ్యాట్లు, యోగా మ్యాట్లు, శానిటరీ న్యాప్కిన్లు, పేపర్, హ్యాండ్ బ్యాగ్లు, పూల బుట్టలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 రకాల ఉపఉత్పత్తులు అరటి నుంచి వచ్చినవే. మీరు చదివింది నిజమే. ఇవన్నీ అరటి నుంచి తయారు చేసినవే.
Products From Banana Tree Waste : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలోని వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అరటి నుంచి ఉపఉత్పత్తుల తయారీపై యువత, మహిళలు, రైతులకు 5 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించగా, పలువురు వీటి తయారీలో ఆసక్తిగా పాల్గొని శిక్షణ తీసుకున్నారు.
అరటి బోదెలతో ఓ యంత్రం : మన రాష్ట్రంలో అరటి సాగు చేసే రైతుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే అరటి గెలలను మార్కెటింగ్ చేసిన తర్వాత ఆ చెట్లను కొట్టేసి పడేయడం తప్ప రైతులకు మరో అవకాశం లేదు. ఆ చెత్తను తొలగించడం కూడా రైతులకు పెద్ద సమస్యే. చెన్నై ఈ-రోడ్లోని కేవీకేలో శిక్షణ పొందిన ప్రసాద్, కార్తికేయ ఇద్దరూ ఇందుకు పరిష్కార మార్గం కనుగొన్నారు. రైతులు వృథాగా పడేసే అరటి బోదెలతో ఓ యంత్రం ద్వారా నార తీసి, దాని ద్వారా పలు రకాల ఉపఉత్పత్తులు తయారు చేయవచ్చని నిరూపించడమే కాకుండా వాటి తయారీలో పలువురికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
యువత, మహిళలకు శిక్షణ : ఇందులో భాగంగా కేవీకే వెంకట్రామన్నగూడెంలో అరటి నుంచి ఉపఉత్పత్తుల తయారీలో మహిళలు, యువత, రైతులకు ప్రత్యేకంగా 5 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఇందులో అరటి నార తీయడం మొదలు అరటి నుంచి వచ్చే నీటితో క్రిమిసంహారక మందులు, సౌందర్య ఉత్పత్తులు తయారీ వరకూ శిక్షణ ఇచ్చారు. స్వయం ఉపాధిగానే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పించేలా, సులభంగా ఉన్న ఈ శిక్షణపై మహిళలు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అరటితో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? : రైతులు అరటి సాగు ద్వారా ఎంత సంపాదించవచ్చో, అంతకు రెండు రెట్లు ఎక్కువగానే ఉపఉత్పత్తుల ద్వారా సంపాదించవచ్చని చెన్నై నుంచి వచ్చిన ట్రైనర్ ప్రసాద్ చెబుతున్నారు. రైతులకే కాకుండా మహిళలు కూడా వీటి ద్వారా ఉపాధి పొందవచ్చని, కుటీర పరిశ్రమలు నెలకొల్పి మరికొందరికి ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. అరటితో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అని రైతులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై అరటి బోదెలను పడేయకుండా, శిక్షణలో నేర్చుకున్న విధంగా ఉపఉత్పత్తులు తయారు చేసి ఆర్థికంగా ఎదుగుతామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ప్లాస్టిక్ బాటిళ్లలతో అందమైన ఇల్లు- 85వేల సీసాలతో ఇలా కట్టేశారు! - House Made With Plastic Bottles
కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చు : యువత, మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు రైతులకు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేయడమే తమ విధి అని కేవీకే ప్రధాన శాస్త్రవేత్త కరుణశ్రీ తెలిపారు. ఈ శిక్షణ తీసుకున్న వారికి ఐసీఏఆర్ ద్వారా నిధులు అందించి అరటి నుంచి నార తీసే యంత్రాలను సైతం గిరిజన మహిళలకు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళలను ఒక బృందంగా మార్చి వారికి శిక్షణ ఇచ్చి వారిని మాస్టర్ ట్రైనర్లుగా తయారు చేసి మరికొందరికి ఈ శిక్షణలో నైపుణ్యం అందించనున్నామని, ఐదు లేదా ఆరుగురు మహిళలు కలిసి కుటీర పరిశ్రమగానూ ఏర్పాటు చేసుకునే సౌలభ్యం ఉందని కరుణశ్రీ వెల్లడించారు.
ఐదు రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణ తరగతుల్లో పోలవరం లాంటి గిరిజన ప్రాంతాలతో పాటు తాడేపల్లిగూడెం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి మహిళలు, యువత, రైతులు ఆసక్తిగా పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీరోడ్డు నిర్మాణం- కాలేజీ పరిశోధనకు పేటెంట్