Mangalagiri AIIMS Using Drones Services has been Successful : వైద్య సేవల్లో డ్రోన్ల వినియోగానికి సంబంధించి గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో నిర్వహించిన ప్రయోగం విజయవంతమైంది. మంగళగిరి నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని నూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి సేకరించిన రక్త నమూనాల్ని డ్రోన్ ద్వారా తీసుకువచ్చారు. ఇకపై రక్త నమూనాల సేకరణతో పాటు ఇతర అత్యవసర వైద్య సేవల్ని డ్రోన్ సాయంతో సులువుగా అందించొచ్చని ఆసుపత్రి సంచాలకులు తెలిపారు.
ప్రయోగం విజయవంతం : ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో పేరు పొందిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ – ఎయిమ్స్ ఇప్పుడు డ్రోన్ ద్వారా వైద్య సేవలు అందించే దిశగా తొలి అడుగు వేసింది. ఆసుపత్రి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డ్రోన్‌ను పంపి అక్కడి నుంచి 10 మంది రోగుల రక్త నమూనాల్ని తీసుకొచ్చారు. వాటిని ఎయిమ్స్ ప్రయోగశాలలో పరీక్షించారు. ఈ ప్రయోగం విజయవంతం కావటంతో ఆసుపత్రి వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది.
'హైదరాబాద్ టు విజయవాడ 45 నిమిషాల్లోనే!' - అనుమతులు రావడమే ఆలస్యం - "ఎగిరిపోవడమే"
ఎయిమ్స్ సేవల్లో డ్రోన్ల వినియోగం : డ్రోన్ ఆకాశ మార్గంలో నూతక్కి వెళ్లి తిరిగి వచ్చేందుకు 18 నిమిషాలు పట్టింది. దీనికి ఎలాంటి అవరోధాలు ఎదురుకాలేదని ఇకపై రక్త నమూనాల సేకరణతో పాటు ఇతర అత్యవసర వైద్యసేవల్ని డ్రోన్ సాయంతో కొనసాగిస్తామని ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ మధుబానందకర్ వెల్లడించారు. నూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యసేవలు ఎయిమ్స్ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. వైద్యులు, హౌస్ సర్జన్లు, సీనియర్ రెసిడెంట్లు, ఇతర పారామెడికల్ సిబ్బంది నిత్యం అక్కడకు వెళ్లి గ్రామ ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రత్యేకించి వారానికి రెండుసార్లు గర్భిణిలకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇక మీదట ఆ పరీక్షల నమూనాలను డ్రోన్‌తో తీసుకొచ్చి వెంటనే నిర్దారణ పరీక్షలు చేసి సకాలంలో రిపోర్టులు అందించేందుకు డ్రోన్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటామని ఎయిమ్స్ సంచాలకులు తెలిపారు.
"భారత్ భవిష్యత్ బాగుండాలి - ఆ విజయంలో ఏపీ ప్రధాన పాత్ర కావాలి" - విశ్వాసం పెంచిన డ్రోన్ సమ్మిట్
ఆడవాళ్లందరూ ఇక్కడకు రాలేరు. ప్రతి నెలా రక్త నమూనాల పరీక్షలతో పాటు వైద్య పరీక్షలు వారికి చెయ్యాల్సి ఉంటుంది. డ్రోన్ ద్వారా నూతక్కి నుంచి ఇక్కడకు వారి రక్త నమూనాలు తీసుకొచ్చి పరీక్షిస్తాం. ఆడవాళ్లకు వైద్య పరీక్షల కోసం ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చాం. ఈ సేవలు మరింత విస్తరిస్తాం. రాబోయే రోజుల్లో వైద్య రంగంలో డ్రోన్లు కీలక భూమిక పోషిస్తాయి. డ్రోన్ సేవలకు రోగుల నుంచి ఏమీ ఎక్కువ వసూలు చెయ్యం. ఇది చాలా చౌకైనది. ఇది ఎయిమ్స్‌లో ప్రాథమికంగా ప్రారంభించాం. దీన్ని మరింత విస్తరిస్తాం -మాధవానందకర్, ఎయిమ్స్ సంచాలకులు
నూతక్కి పీహెచ్‌సీకి సేవలు : జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం దిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ సేవలను ప్రారంభించారు. ఆసుపత్రికి అనుబంధంగా నూతక్కిలో గ్రామీణ ఆరోగ్య శిక్షణా కేంద్రం ఉంది. ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చదివే విద్యార్థులు ఇక్కడ క్షేత్రస్ధాయి శిక్షణ పొందుతారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని డ్రోన్‌తో వైద్యసేవలు అందించాలని ఎయిమ్స్ కొన్నాళ్లుగా భావిస్తోంది. అందులో భాగంగా డ్రోన్ సేవల కోసం ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రక్తనమూనాలు సేకరించి ఆకాశమార్గంలో తీసుకొచ్చే బాధ్యత ఆ సంస్థకు అప్పగించారు. రాబోయే రోజుల్లో సేవలు విస్తరిస్తామని దీనిద్వారా ప్రజలకు మరింత చేరువవుతామని ఎయిమ్స్ అధికారులు తెలిపారు.
ఆపత్కాలంలో డ్రోన్లదే కీరోల్ - ప్రజాభద్రతలోనూ సమర్థ వినియోగం
వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సిబ్బంది వెళ్లి రక్త నమూనాలు తీసుకువచ్చేందుకు ఎక్కువ సమయం పడుతుంది. వాహనాలు అవసరం. ఫలితాలను అందజేసేందుకు మళ్లీ అక్కడకు వెళ్లాలి. ఇకపై అవసరం లేకుండా ల్యాబ్‌లో పరీక్షలు పూర్తికాగానే రిపోర్టులు, ఔషధాలు, ఇంజక్షన్లు డ్రోన్‌లో పంపి అక్కడి వైద్యులకు ఫోన్‌లో తెలియజేస్తే సరిపోతుంది. దీనివల్ల సమయం, మానవ వనరులు ఆదా అవుతాయని అధికారులు తెలిపారు. ఈ డ్రోన్లను 40 నుంచి 45 కిలోమీటర్ల వరకు పంపించి నమూనాలు సేకరించే అవకాశం ఉందన్నారు