Actor Mohan Babu Complaint on Manchu Manoj : గత రెండు రోజులుగా మంచు కుటుంబంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. సోమవారం సాయంత్రం మోహన్‌బాబు, మనోజ్‌ల ఫిర్యాదులతో గొడవలు బహిర్గతమయ్యాయి. మొదట మనోజ్‌కు మోహన్‌బాబుకు మధ్య ఘర్షణ జరిగిందంటూ ఆదివారం విస్తృతంగా ప్రచారం జరిగినా మోహన్‌బాబు దాన్ని ఖండించారు. అయితే అనూహ్యంగా సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకువచ్చింది. హైదరాబాద్ శివారు జల్‌పల్లిలోని మంచుటౌన్‌లో పదేళ్లుగా నివాసం ఉంటున్న చిన్నకుమారుడు మనోజ్ యాధృచ్చికంగా తన ఇంటి నుంచి వెళ్లిపోయి నాలుగు నెలల క్రితం మళ్లీ తిరిగొచ్చాడని మోహన్‌బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మనోజ్ తను నియమించుకున్న కొందరు అసాంఘిక శక్తులతో కలిసి ఈ నెల 8న తన ఇంట్లో అలజడి సృష్టించాడని, ఆ తర్వాత అతడి ఏడు నెలల శిశువుని పనిమనిషి సంరక్షణలో ఉంచి భార్య మౌనికతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడని మోహన్‌బాబు ఫిర్యాదులో తెలిపారు. ఆ తర్వాత వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి అదే రోజు ఇంటికి తిరిగొచ్చాడని, మరుసటి రోజు తెల్లవారుజామున రోజువారీ పనుల్లో భాగంగా బయటికి వెళ్తున్నప్పుడు ఇంటికి సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తుల్ని గమనించానన్నారు. మాదాపూర్‌లోని కార్యాలయానికి వెళ్లిన తర్వాత మనోజ్ అనుచరులు దాదాపు 30 మంది జల్‌పల్లిలోని నివాసంలోకి బలవంతంగా చొరబడినట్లు తెలుసుకున్నానని, అక్కడుండే సిబ్బందిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారన్నారు.
'ఎవరి పేర్లు నమోదు చేయలేదు. గుర్తుతెలియని పది మంది అని ఫిర్యాదులో రాశారు. కుటుంబసభ్యులు, మోహన్‌బాబు పేర్లు ఫిర్యాదులో లేవు. ఎందుకు దాడి చేశారు అని తెలియదని, తనకు తన పిల్లలకు ప్రమాదం ఉందని చెప్పారు. సీసీటీవీ కెమెరాలను విజయ్ రెడ్డి, కిరణ్ మాయం చేసినట్లు చెప్పారు'-గురువారెడ్డి, ఇన్‌స్పెక్టర్, పహాడీషరీఫ్
పహాడీషరీఫ్ పీఎస్‌లో మనోజ్ ఫిర్యాదు : ఇంటి నుంచి శాశ్వతంగా బయటకు పంపించాలని చూస్తున్నారని, ఇంట్లో ఉన్న సంఘ విద్రోహ శక్తులు తనతో పాటు అక్కడున్నవారికి ప్రాణహాని చేస్తారనే భయం కలుగుతోందని మోహన్‌బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిణామాల దృష్ట్యా మనోజ్, మౌనిక వారి సహాయకుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇంటి నుంచి వారందరినీ ఖాళీ చేయించాలని, తగిన భద్రత కల్పించడంతో పాటు ఇంట్లోకి భయం లేకుండా ప్రవేశించేందుకు తోడ్పాటు అందించాలని మోహన్‌బాబు రాచకొండ సీపీకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. మరోవైపు తనపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని నటుడు మంచు మనోజ్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కుటుంబ గొడవలు మరింత రచ్చకెక్కాయి.
My humble request to serve justice through a transparent and righteous investigation.@ncbn Garu @naralokesh Garu @PawanKalyan Garu @Anitha_TDP Garu @revanth_anumula Garu @Bhatti_Mallu Garu @TelanganaCMO @TelanganaDGP Garu 🙏🏼 https://t.co/M3xbNALZje pic.twitter.com/BBokLPLNEP
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 9, 2024
ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి భార్య, కుమారుడిని చుట్టుముట్టారని, చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారని మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ గురువారెడ్డికి సోమవారం సాయంత్రం ఫిర్యాదు అందించారు. ఈ నెల 8న తాను చిత్రీకరణ కోసం బయటకు వెళ్లాల్సి ఉన్నా అనివార్య కారణాలతో రద్దు చేసుకుని ఇంట్లో ఉన్నానన్నారు. కర్రలతో వచ్చిన 10 మంది జల్‌పల్లిలోని తన నివాసంలోకి ప్రవేశించారన్నారు. వాస్తవానికి చిత్రీకరణ కోసం వెళ్తాననే సమాచారంతో ఇంట్లోకి వచ్చి భార్య, పిల్లల్ని చుట్టుముట్టాలని చూశారన్నారు.
అదృశ్యమైన సీసీటీవీ ఫుటేజీలు : ఇది గమనించి కిందకు వచ్చినప్పుడు తనను చూసిన గుర్తుతెలియని వ్యక్తులు గట్టిగా అరుస్తూ బయటకు పరుగెత్తారని మంచు మనోజ్ ఫిర్యాదులో తెలిపారు. వారిని వెంటాడి పట్టుకునే సమయంలో జరిగిన పోట్లాటలో గాయపడినట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి తిరిగొచ్చి చూడగా సీసీటీవీ ఫుటేజీలు అదృశ్యమయ్యాయన్నారు. దీనిపై పనివాళ్లను అడిగినప్పుడు విజయ్ రెడ్డి, కిరణ్ తాను ఆసుపత్రికి వెళ్లాక సీసీటీవీ ఫుటేజీలు తీసుకున్నట్లు చెప్పారన్నారు. విజయ్ రెడ్డి, కిరణ్‌కు గుర్తుతెలియని దాడి పథకం గురించి ముందే తెలిసి ఉంటుందని ఆరోపించారు. లేనిపక్షంలో తన ఇంట్లోకి కొందరు బలవంతంగా ప్రవేశించినట్లు సాక్ష్యాలుండే సీసీటీవీ పుటేజీలు తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందన్నారు.
ఎక్స్ వేదికగా మంచు మనోజ్ ట్వీట్ : తన కుటుంటానికి తనకు తగిన రక్షణ కల్పించాలని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్ నుంచి ఫిర్యాదు తీసుకున్నామని, దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు సేకరిస్తామని పహడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ గురువారెడ్డి తెలిపారు. మోహన్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని తెలిపారు. సోమవారం అర్ధరాత్రి ఎక్స్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఉపముఖ్యమంత్రులను, తెలంగాణ డీజీపీ, ఏపీ హోంమంత్రి అనితను ట్యాగ్ చేస్తూ తనకు న్యాయం చేయాలని మనోజ్ కోరారు.
కుమారుడు మంచు మనోజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మోహన్‌బాబు
హీరో మంచు మనోజ్ కాలికి గాయం - చికిత్స కోసం బంజారాహిల్స్ హాస్పిటల్‌కు