Manchu Mohan Babu Apology to Journalists: రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలోని తన ఇంటి వద్ద మీడియా ప్రతినిధిపై దాడి ఘటనపై మంచు మోహన్‌బాబు తాజాగా మరోసారి స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా మీడియా ప్రతినిధిని కొట్టలేదని తెలిపారు. ఈ ఘటనపై జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. తన ఇంట్లో జరిగిన దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టును మోహన్‌బాబు, మంచు విష్ణు పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరి కుటుంబ సభ్యులకు మోహన్‌బాబు క్షమాపణ చెప్పారు.
కాగా తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని జల్‌పల్లిలో సినీనటుడు మంచు మోహన్‌బాబు నివాసం వద్ద ఈ నెల 10వ తేదీ రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ అదనపు డీజీపీని కలిసిన అనంతరం మంచు మనోజ్ దంపతులు మోహన్‌బాబు ఇంటికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
సెక్యూరిటీ గేట్లు తీయకపోవడంతో మనోజ్ అక్కడి భద్రతా సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్లు నెట్టుకొని లోపలికి వెళ్లారు. ఈ సమయంలో ఆయనతో పాటు అక్కడ ఉన్న మీడియా సిబ్బంది సైతం మోహన్‌బాబు ఇంట్లోకి వెళ్లారు. ఈ ఉద్రిక్తతల నడుమ మోహన్‌బాబు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో కొందరు ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జర్నలిస్ట్ గాయపడ్డారు. మరోవైపు ఇప్పటికే మోహన్‌బాబుపై కేసు నమోదు చేశారు. మోహన్‌బాబుపై బీఎన్‌ఎస్ (Bharatiya Nyaya Sanhita) 118 సెక్షన్ పోలీసులు కింద కేసు నమోదు చేశారు.