Manchu Family Issue : కుటుంబ వివాదం, ఘర్షణల నేపథ్యంలో మోహన్‌బాబు కుమారులు మంచు మనోజ్, మంచు విష్ణు రాచకొండ పోలీస్ కమిషనర్, జిల్లా అదనపు మేజిస్ట్రేట్ సుధీర్‌బాబు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జల్‌పల్లిలోని నివాసం దగ్గర జనం గుమిగూడొద్దని మరోసారి గొడవలు జరిగితే చర్యలు తీవ్రంగా ఉంటాయని సీపీ హెచ్చరించారు. మరోవైపు జర్నలిస్టుపై దాడి విషయంలో సినీనటుడు మోహన్‌బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆయనపై తొలుత బీఎన్‌ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు నమోదైంది. తాజాగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
సీపీ నోటీసులు : కుటుంబ వివాదం, పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదైన దృష్ట్యా విచారణకు హాజరవ్వాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌కు మంగళవారం రాత్రి నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు మనోజ్ మధ్యాహ్నం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ సీపీ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు రెండు గంటలకుపైగా అక్కడే ఉన్న మంచు మనోజ్ నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు.
శాంతి భద్రతల సమస్యగా మార్చకూడదు : కుటుంబ వివాదాలను శాంతి భద్రతల సమస్యగా మార్చకూడదని, ఇరు వర్గాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సీపీ సూచించారు. ఏడాది పాటు ఎలాంటి నేరాలకు పాల్పడనంటు లక్ష రూపాయల పూచీకత్తును సీపీకి సమర్పించారు. ఆ తర్వాత సాయంత్రం మోహన్‌బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ ఎదుట హాజరయ్యారు.
వివాదంలో ఎలాంటి సమస్యలు సృష్టించవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని సుధీర్ బాబు స్పష్టం చేశారు. మరోవైపు పోలీసు విచారణ తర్వాత మనోజ్ నేరుగా జల్‌పల్లిలోని నివాసానికి వెళ్లారు. అప్పటికే విష్ణు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా బౌన్సర్లను పంపించేయాలంటూ ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
జల్‌పల్లిలోని నివాసం దగ్గర మనోజ్ : జల్‌పల్లిలోని నివాసం దగ్గర మనోజ్ కన్నీరు పెడుతూ మీడియాతో మాట్లాడారు. మోహన్ బాబు భుజం మీద తుపాకీ పెట్టి తనను కాల్చాలని చూస్తున్నారని, కుటుంబ సమస్యపై చర్చలకు సిద్ధమేనని మనోజ్ వ్యాఖ్యానించారు. విద్యానికేతన్ సంస్థలో విజయ్‌రెడ్డి అనే వ్యక్తి అక్రమాలకు పాల్పడుతున్నాడని, చంద్రగిరి మండలానికి చెందిన పేద ప్రజలు నాన్న వరకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఈ విషయం గురించి నాన్నకు చెప్పాలనే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారని మనోజ్ తెలిపారు. సంబంధం లేకున్నా తన భార్యా పిల్లల ప్రస్తావన తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సమస్యపై కూర్చొని మాట్లాడుకోవడానికి తానెప్పుడు సిద్ధమేనన్నారు. ఇప్పుడు జరుగుతున్న గొడవలకు తన తండ్రి మోహన్‌బాబు కారణం కాదని సీపీని కలిసిన అనంతరం మనోజ్ స్పష్టం చేశారు.
కాంటినెంటల్ ఆస్పత్రి వద్ద మీడియాతో విష్ణు : ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయని వీటిని సంచలనం చేయొద్దని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడిన విష్ణు తన తల్లిదండ్రులు ఇద్దరూ ఆస్పత్రిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాపై జరిగిన ఘటన దురదృష్టకరమని విష్ణు వ్యాఖ్యానించారు. జల్‌పల్లిలోని ఇల్లు మోహన్‌బాబు కష్టార్జితమని అందులో మనోజ్ ఉండొద్దనే హక్కు ఆయనకు ఉందన్నారు.
మోహన్‌బాబుపై కేసు : జర్నలిస్టు మీద దాడి వ్యవహారంలో మోహన్‌బాబుపై పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మరోవైపు తనపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని, ఈ దృశ్యాలు నమోదైన సీసీటీవీ కెమెరాలు తీసుకెళ్లారంటూ మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై సోమవారం రాత్రి పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లోనూ కేసు నమోదైంది. మోహన్‌బాబు అనుచరుడు కిరణ్, విద్యానికేతన్ వ్యవహారాలు చూసే విజయ్‌రెడ్డిని ఠాణాకు తీసుకొచ్చి విచారించారు. అటు మోహన్‌బాబు ఎడమ కంటి కింద గాయాలున్నట్లు ఆయనకు చికిత్స అందిస్తున్న కాంటినెంటల్ ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. అధిక రక్తపోటు, అధిక హృదయ స్పందన సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించరాదు - మంచు విష్ణుకు సూచించిన రాచకొండ సీపీ
హైకోర్టులో మోహన్‌బాబుకు ఊరట - అప్పటివరకు పోలీసుల ముందు హాజరుకు మినహాయింపు