Man Offer Two Crore Rupees to Become Sarpanch : ''వచ్చే సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ పదవికి నన్ను ఏకగ్రీవం ఎన్నుకుంటే రూ.2 కోట్లు గ్రామ అభివృద్ధికి ఇస్తా'' అంటూ ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. ఏంటీ గ్రామ సర్పంచ్ పదవికి రూ.2 కోట్లా అని అనుకుంటున్నారా? దీనికి నిజమేనని సమాధానం వస్తోంది. ఎన్నికల బరిలో నిలిచి పోటీ చేసి ప్రతి ఓటరును ఓటేయండి అని అడిగే బదులు, ఒకేసారి సెటిల్మెంట్ అయ్యేలా కొందరు ఇలా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో ఖర్చు చేసే బదులు గ్రామ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నగదు ఇస్తానంటూ తమను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇంతకీ రూ. 2 కోట్లు ఇస్తానంటున్న వ్యక్తి జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవెల్లి గ్రామపంచాయతీకి చెందిన వారు. తనను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఏకంగా రూ. 2 కోట్లు ఇస్తానంటూ పేర్కొన్నారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతోపాటు జిల్లాలోని చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పోస్టు సైతం తెగ వైరలవుతోంది. ఎర్రవెల్లి గ్రామానికి చెందిన పూల మద్దిలేటి అనే వ్యక్తి సర్పంచ్‌గా తనను ఎన్నుకోవాలని ఆ గ్రామ ప్రజలకు కోరారు. పోటీ లేకుండా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి చేస్తానని, రెండు కోట్ల రూపాయలను పంచాయతీ పరిధిలోని ప్రజలకు పండగల సందర్భంగా ఇస్తానని తెలిపారు.
గ్రామంలో చర్చించుకుంటున్న గ్రామస్థులు : ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ మారింది. గతంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల వరకు ఖర్చు అయ్యాయని, అందుకేనేమో ఏకంగా ఒకేసారి రెండు కోట్లు రూపాయలు ఇస్తానని ఈ అభ్యర్థి చెబుతున్నారని ఎర్రవల్లి గ్రామ ప్రజలు గుసగుసలాడుతున్నారు.
ఎన్నికలకు ముందే సర్పంచ్‌గా ఎన్నిక : మరోవైపు గత నెలలో కూడా వరంగల్ జిల్లాలో దరావత్ బాలాజీ అనే వ్యక్తి తనను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే, సొంత డబ్బులతో గ్రామంలో బొడ్రాయి, పోచమ్మ తల్లి, ఆంజనేయ స్వామి గుళ్లు కట్టిస్తానని, అలాగే విగ్రహాలు పెట్టిస్తానని హామీ ఇచ్చాడు. అంతేకాకుండా బొడ్రాయి పండుగ ఖర్చుల కోసం ఇంటింటికి రూ.1000 చొప్పున పంచుతానని చెప్పాడు. ఇందుకోసం వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎవరూ పోటీచేయకుండా, తనను ఏకగ్రీవం చేయాలని కండిషన్ పెట్టాడు. దీంతో గ్రామస్థులు సైతం సమావేశమై గడువులోగా ఈ పనులు పూర్తి అయితే కేవలం అతను మాత్రమే నామినేషన్ వేసేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సర్పంచ్ పదవికి వేలం పాట - రూ.2కోట్లకు కుర్చీ దక్కించుకున్న బీజేపీ నేత!