Bulls Killer : ఆ గ్రామంలో దాదాపు నాలుగు సంవత్సరాలుగా 80 మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. వాటిలో ఎద్దులే ఎక్కువ కాగా, కొన్ని బర్రెలు కూడా ఉన్నాయి. దీంతో ఆందోళనకు గురైన పశువుల యజమానులు వైద్యాధికారులను సంప్రదించారు. పశువుల మృతికి కారణమేంటో వారు కూడా తేల్చకపోవడంతో గ్రామానికి ఏదో చెడు ఆవహించిందని, శాంతి చేయాలని అందరూ భావించారు. తాజాగా ఓ ఇంటి సీసీ కెమెరాలో కనిపించిన దృశ్యాలతో గ్రామస్థులు షాక్ అయ్యారు.
వ్యవసాయం, పశువులు విడదీయలేని సంబంధాన్ని కలిగి ఉంటాయి. వ్యవసాయ పనుల్లో పశువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దుక్కి దున్నడం మొదలుకుని పంట చేతికందే వరకూ ఆరుగాలం రైతు పడే శ్రమలో పశువులు పాల్పంచుకుంటాయి. అయితే, తమకు జీవనాధారమైన పశువులు ఒక్కొక్కటిగా మృతి చెందుతుండడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. నాలుగేళ్ల వ్యవధిలో 80 మూగజీవాల మృతికి కారణం తెలిసి రగిలి పోయారు.
ఊర్లో ఎవరి దగ్గరా ఎద్దులు లేకుంటే, తన ఎద్దులనే బాడుగకు తీసుకుంటారని భావించిన ఓ రైతు దుర్బుద్ధి 80 మూగజీవాలను బలితీసుకుంది. నంద్యాల జిల్లా డోన్ మండలం కమలాపురం గ్రామానికి చెందిన కమ్మరి శంకరాచారి గ్రామంలో కమ్మరి పని చేసుకుంటూ జీవించే వాడు. అతనికి సొంత పొలంతో పాటు ఎద్దులు ఉన్నాయి. గ్రామంలోని రైతుల ఎడ్లబండ్లకు వడ్రంగి పని కూడా అతడే చేస్తుంటాడు. ఈ క్రమంలో అదనంగా సంపాదించాలన్న దురాలోచన అతడిని అమానవీయ ఘటనల దిశగా నడిపించింది.
గ్రామంలో ఇతర రైతులకు ఎద్దులు లేకుండా చేస్తే తన ఎద్దులనే బాడుగకు తీసుకువెళ్తారని భావించాడు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా రైతుల ఎద్దులను అంతం చేయడానికి పథకరచన చేశాడు. ఇతర రైతులు బాడుగకు తీసుకెళ్లే ఎద్దులకు విషపు గుళికలు తినిపించేవాడు. రాత్రి సమయాన్ని అదనుగా భావించి పథకాన్ని అమలు చేసేవాడు. మరుసటి రోజు ఉదయం కల్లా ఆ మూగజీవాలు మృత్యువాత పడేవి. కమలాపురంలో దాదాపు నాలుగు సంవత్సరాల వ్యవధిలో 80 మూగ జీవాలు మృతి చెందాయి. గ్రామంలో అంతు చిక్కని కారణంతో తరచూ మూగజీవాలు మృత్యువాత పడుతుంటే ఎంతో మంది రైతులు తలలు పట్టుకున్నారు. పశువైద్యాధికారులు కూడా కారణం చెప్పలేకపోవడంతో గ్రామానికి దేవర చేయాలంటూ కొందరు, గ్రామానికి ఏదో గ్రహ తగిలిందని మరికొందరు భావించారు. శంకరాచారి ఎప్పటిలాగే ఈ నెల 11న అదే గ్రామానికి చెందిన బుగ్గన శివ రామిరెడ్డి ఇంటి పెరట్లో ఉన్న పశువుల దగ్గరకు గోడదూకి లోపలికి వచ్చాడు. చేతిలో విషపు గుళికల మందును పెట్టుకొని వచ్చి కోడె దూడ వద్ద ఉంచి అక్కడి నుంచి గోడ దూకి ఉడాయించాడు. ఈ దృశ్యాలన్నీ శివరామిరెడ్డి ఇంటి ఆవరణలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఊహించని రీతిలో సీసీ ఫుటేజీలో అతడిని గమనించిన శివరామిరెడ్డి జరిగిన విషయాన్ని గ్రామస్థులతో పంచుకున్నాడు. దీంతో గ్రామంలో పశువుల మృతికి శంకరాచారే కారణమంటూ అతడిపై డోన్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
శంకరాచారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది. గ్రామంలో ఎద్దులు లేకుంటే తన ఎద్దులనే బాడుగకు తీసుకుంటారని భావించి అలా చేశానని అంగీకరించినట్లు సమాచారం. ఒక రైతుగా మూగజీవాలకు మందు పెట్టడానికి చేతులు ఎలా వచ్చాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మృత్యువాత పడిన మగజీవాల రైతులు ఆగ్రహంతో డోన్ గ్రామీణ పోలీస్ స్టేషను వద్ద ఆందోళన చేశారు. తమకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నాలుగు పందెం ఎద్దులు మృతి... ఎలా చనిపోయాయి?
సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు వ్యక్తులతో సహా రెండు ఎద్దులు మృతి