Man Arrested For Making Fake Currency Note at Hyderabad : వరంగల్ జిల్లాకు చెందిన వనం లక్ష్మీనారాయణ స్థానికంగా బోడుప్పల్‌లో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. బీటెక్ రెండో సంవత్సరం వరకు చదివిన నిందితుడు చదువు ఆపేశాడు. తర్వాత నకిలీ బంగారం తనాఖా కేసులో బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలో నిందితుడిగా ఉన్నాడు. తర్వాత ఆర్థిక పరిస్థితి బాగోలేక నకిలీ నోట్ల తయారీ చేయాలనుకున్నాడు. అందుకోసం ఫర్జీ(Farzi) అనే బాలీవుడ్ వెబ్‌సిరీస్‌తో స్ఫూర్తి పొంది నకిలీ నోట్ల తయారీకి పూనుకున్నడు. కంప్యూటర్, ప్రింటర్‌కు సంబంధించిన అవగాహన ఉండడంతో ఇంట్లోనే కుటుంబ సభ్యులకు తెలియకుండా నకిలీ నోట్లు తయారు చేశాడు.
ముందుగా అసలు నోట్లను స్కాన్ చేసి, తర్వాత ఎక్సెల్ బాండ్ పేపర్‌పై గ్రీన్ ఫాయిల్ పేపర్‌ను లామినేషన్ మిషన్ సాయంతో పేపర్‌కు అతికించి నోటు ఔట్‌లైన్ నమూనాను తయారుచేశాడు. ముందుగానే స్కాన్ చేసిన కాపీని ఔట్‌లైన్ నమూనాపై ముద్రించి, వాటర్‌మార్క్‌ను జోడించి నకిలీ నోట్లను తయారుచేశాడు. ఇంట్లోని గదిలో కుటుంబ సభ్యులకు సైతం తెలియకుండా ఈ ముద్రణ చేసిన్నట్లు పోలీసులు గుర్తించారు.
Fake Currency Note Case in Hyderabad : నోట్లు ముద్రించిన తర్వాత నిందితుడు వాటి చలామణీ కోసం వరంగల్ సంగెంకు చెందిన ఎరుకల ప్రణయ్‌తో సమన్వయం చేసుకున్నాడు. నకిలీ నోట్లను చలామణీ చేసేందుకు వినియోగదారులు కావాలని అందుకోసం 1:4 నిష్పత్తిలో(Ratio) ఒప్పందం చేసుకోవాలని భావించాడు. అంటే ఎవరైనా 50వేల అసలైన నగదు ఇస్తే, 2 లక్షల నకిలీ నోట్లు ఇచ్చేలా ప్రయత్నాలు చేశారు. అందుకోసం 20 వేలు విలువ చేసే నకిలీ 500 నోట్లతో రద్దీగా ఉండే అల్లాపూర్‌లోని కూరగాయల మార్కెట్‌లో వాటిని చలామణీ చేసే ప్రయత్నాల్లో ఉండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు.
పట్టుబడ్డ తర్వాత విచారణలో నిందితుడు వనం లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసి అతనివద్ద రూ. 4 లక్షల 5 వేల రూపాయలు విలువ చేసే 3 లక్షల 85 వేలు విలువ గల 500 రూపాయల నకిలీ నోట్లు పట్టుకున్నారు. నిందితుడి నుంచి ఒక వాహనం, 2 ప్రింటర్లు, ఒక ల్యాప్‌టాప్ సహా మరిన్ని పరికరాలతో కలిపి రూ. 6 లక్షలు విలువ చేసే సొత్తును పోలీసులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు బృందాలను బాలానగర్ జోన్ డీసీపీ టి.శ్రీనివాసరావు అభినందించారు.
సైబర్ నేరాల్లో ఇదో కొత్తరకం - ఫేక్ లీగల్ నోటీసులతో సొమ్ము కాజేస్తున్న గ్యాంగ్ అరెస్ట్