Mallikarjuna Maha Mandapam in Kanakadurga Temple: జగన్ ఐదు సంవత్సరాల పరిపాలనలో విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఓ షెడ్డు కూడా వేయకుండా ఇద్దరు దేవాదాయ శాఖ మంత్రులు కాలక్షేపం చేశారు. రూ.50 కోట్లతో కట్టిన ఏడు అంతస్తుల మహామండపాన్ని దేనికి వాడాలో నేటికీ తెలియట్లేదు. గతంలో ఓ ఈవో కార్యాలయాలుగా వాడతామంటే, మరొకరు డార్మెటరీలు, స్టీల్ క్యూలైన్లు అన్నారు. మరొకరు అన్నదానం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎలివేటెడ్ క్యూలైన్‌కు కంపార్ట్‌మెంట్లు అంటున్నారు. అసలు కనకదుర్గ ఆలయానికి రోజూ 30 వేలలోపు భక్తులు వస్తుంటారు. శని, ఆదివారాల్లో ఎక్కువగా వచ్చినా దర్శనానికి కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు.
ఎన్నికల కోడ్‌కు మూడు నెలల ముందున అప్పటి సీఎం జగన్ హడావుడిగా రూ.220 కోట్లతో అభివృద్ధి పనులనీ నమూనాలు పరిశీలించి, శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఈ భారీ ప్రణాళికలు, పనులపై దృష్టి పెడితే రూ.కోట్ల ఆదాయాన్ని కాపాడొచ్చు. వీటిలోనే రూ.13 కోట్లతో కడుతున్న ఎలివేటెడ్ క్యూలైన్ ఉంది. దీంతో పెద్ద ఉపయోగం లేదని విమర్శలు వెలువెత్తాయి. కూటమి ప్రభుత్వం కొలువైనా దేవాదాయ అధికారులకు తప్పుడు నివేదికలు ఇస్తూ గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేలా కొందరు అధికారులు శ్రమిస్తున్నారు.
శంకుస్థాపన చేసి 15 ఏళ్లు - ఇంకా పూర్తి కాని గుణదల ఫ్లైఓవర్ - Gunadala Flyover Construction
ఇంద్రకీలాద్రి దిగువన కనకదుర్గా నగర్ ఆరంభం నుంచి మహామండపం వద్దకు 300 మీటర్ల దూరమైనా లేదు. పది అడుగులు వేస్తే చాలు మహామండపం వద్దకు వచ్చేస్తారు. కానీ ఎండ, వాన, ట్రాఫిక్ ఇబ్బందులనీ అందుకే క్యూ కాంప్లెక్స్ కడుతున్నామని ఉన్నత అధికారులను నమ్మిస్తున్నారు. అదే నిజమైతే ఇంత భారీ ఖర్చు చేయాల్సిన పనే లేదు. కేవలం కోటి రూపాయలతో క్యూలైన్, దానిపై శాశ్వత పైకప్పు వేస్తే సరిపోతుంది.
దుర్గగుడికి వచ్చే 80 శాతంపైగా భక్తులు నేరుగా వాహనాల్లో ఘాట్‌రోడ్డులో వస్తారు. కుదరకపోతే మహామండపం లిఫ్ట్ ద్వారా రావడానికి ప్రయత్నిస్తుంటారు. ఏడు అంతస్తులు ఉన్న మెట్లు ఎక్కలేమని వాపోతారు. అందుకే గతంలో కనకదుర్గా నగర్ మీదుగా ర్యాంప్ వేసి నేరుగా వాహనాల్లో పైకి చేరుకునే నమూనాలను ఈవోలు రూపొందించారు. గతంలో చంద్రబాబు సర్కారు ఇవే ప్రణాళికలు వేసింది. లేదంటే మరో నాలుగైదు పవర్ లిఫ్ట్‌లు పెట్టాలనుకున్నారు. అవన్నీ ఆపేసి భక్తుల ఇబ్బంది చూడకుండా ఏవేవో కడితే ఏం ప్రయోజనమో అధికారులకే తెలియాలి.
ఏడు అంతస్తుల మహామండపాన్ని కంపార్ట్మెంట్లుగా మార్చి భక్తులను మెట్ల మార్గంలో దర్శనాలకు పంపాలనే ప్రయోగం గతంలోనూ చేశారు. ఏకంగా రూ.5 కోట్లతో స్టీల్ క్యూలైన్లను మహా మండపంలో వేశారు. దసరా వేళ ఇవి ఉపకరిస్తాయని చెప్పి సంవత్సరం పూర్తి కాకుండానే వాటిని తొలగించి మూలన పడేశారు. ఇప్పుడు కొత్తగా ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ మొదలెట్టారు. అంతే కాకుండా మహామండపాన్ని కంపార్ట్మెంట్లుగా మార్చి భక్తులు అక్కడే వేచి ఉండేలా అన్ని సౌకర్యాలు కల్పించేందుకే ఈ క్యూ కాంప్లెక్స్ అని దేవాదాయశాఖ కమిషనర్‌కు నివేదికలు ఇస్తున్నారు.
దసరా వేడుకల్లో చాలా ఖర్చు ఆదా అవుతుందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు దసరా, భవానీ దీక్షల వేళ భక్తులను ఇటు అనుమతించే ప్రసక్తే లేదని పోలీసు, అగ్నిమాపక శాఖ తేల్చాయి. ఇది ప్రమాదకరమనీ వెళ్లే, వచ్చే మార్గాలు వేరుగా ఉండాలని చెప్పారు. వినాయక గుడి దగ్గర నుంచి క్యూలైన్లలో వెళ్లి కనకదుర్గా నగర్ వైపు దిగాలని సూచిస్తున్నారు.