Male and Female Tigers Roaming In Adilabad : అధికారులు ఊహించిందే జరిగింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన మగ పులి కోసం ఆడ పులి వెతుక్కుంటూ వచ్చింది. వారు భావించినట్లే మగ పులి ఏ ప్రాంతాల్లో తిరిగిందో ఆ దారి గుండా వెళ్లి పులి చెంత చేరింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ క్షేత్రాల్లో కొద్దిరోజులుగా ఎస్(12) పులి సంచారం అలజడి సృష్టించింది. జిల్లాలోని జన్నారం కవ్వాల్ మీదుగా లక్షెట్టిపేట, మందమర్రి సెక్షన్‌లోని అందుగులపేట, కాసిపేట మండలంలోని ముత్యంపల్లిస దేవాపూర్ రేంజ్లో తిరుగుతూ కనిపించింది. ఈ ప్రాంతాల్లోని ఆవులపై సైతం దాడి చేస్తూ హతమార్చింది. దాదాపు నెల రోజులపాటు ఈ ప్రాంతాల్లోనే తిరుగుతూ హడలెత్తిస్తోంది.
'నిను వీడని నీడను నేనే' - వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత
అధికారులు అనుకున్న విధంగానే : మగపులి ఎస్(12) రాకతో ఆడపులి వచ్చే అవకాశముంటుందని అటవీ అధికారులు ముందుగానే భావించారు. వారు అనుకున్న విధంగానే మళ్లీ జోడేఘాట్, కెరమెరి, తిర్యాణి, గిన్నేధరి, దేవాపూర్ మీదుగా ఆడ పులి లక్షెట్టిపేట రేంజి పరిధిలోని అందుగులపేట మీదుగా ముత్యంపల్లి సెక్షన్ పరిధిలో ఆనుకుని ఆడపులి సంచరిస్తున్న చిత్రం ఈ నెల 17న కెమెరాకు చిక్కింది. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న పులులు తోడు కోసం ఇటువైపుగా వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఎస్ (12) మగ పులి వచ్చిన దారి మీదుగానే ఆడ పులి వచ్చినట్లు అధికారులు అంటున్నారు. మగ పులి ముత్యంపల్లి సెక్షన్ మీదుగా దేవాపూర్, గిన్నేధరి అటవీ ప్రాంతాలకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పుడు ఆడ పులి అదే దారిగుండా ఇటువైపుగా రావడంతో రెండు జత కలిసేనా అంటే అవుననే సమాధానాలు అధికారుల నుంచి వినిపిస్తున్నాయి. రెండు పులులు జత కలిస్తే కవ్వాల్ కారిడార్‌లో అనువైన ప్రదేశంగా మలుచుకొని ఇక్కడే ఉండే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. మగ పులి ఎస్ (12) వయస్సు రెండు నుంచి మూడేళ్ల వరకు ఉంటుందని అటవీ అధికారులు నిర్ధారించారు. ఆడ పులి వయసు సైతం రెండేళ్లు ఉంటుందని భావిస్తున్నారు. దీంతో అటవీ ప్రాంతాల వైపు రాత్రి పూట ఒంటరిగా వెళ్లొద్దని, పులి గుర్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
రెండు కూనలకు జన్మనిచ్చిన తెల్ల పులి- 4 నెలలు రహస్యంగా ఉంచిన అధికారులు!