Mailaram Village Boycotts Lok Sabha Election : లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు ఆ గ్రామస్థులు. కారణం ఆ ఊరికి ప్రధాన ఆధారంగా ఉన్న గుట్టపై మైనింగ్‌కు అనుమతి ఇవ్వడమే. ఓట్లను అభ్యర్థించేందుకు ఎవరూ తమ ఊరికి రావొద్ధని సూటిగా చెప్తున్నారు. ఇప్పటికే 'గుట్ట ముద్దు ఓటు వద్దు' అనే నినాదంతో ర్యాలీ నిర్వహిస్తూ ఎన్నికల్లో ఓటు వేయమని చెబుతున్నారు. ఊరంతా ఐక్యంగా గుట్ట కోసం పోరాటం చేస్తున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరుగుతోందంటే..?
నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామస్థులు లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించేందుకు సన్నద్ధమవుతున్నారు. గుట్ట ముద్దు - ఓటు వద్దు, సేవ్ మైలారం అనే నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ఉన్న గుట్టపై మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మైనింగ్ అనుమతులు పొందిన సంస్థ పలుమార్లు అక్కడ తవ్వకాలు చేపట్టేందుకు ప్రయత్నించగా గ్రామస్థులు గతంలో అడ్డుకున్నారు. మళ్లీ ఇప్పుడు వారికి అనుమతులు వచ్చాయని తవ్వడానికి సిద్ధమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
"గుట్ట మైనింగ్ కోసం 2016లో పర్మిషన్ తీసుకుని తవ్వడానికి వచ్చారు. మేము అడ్డుకున్నాం. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తవ్వకాలు చేయడానికి వస్తున్నారు. మేం అడ్డుకునే సరికి తిరిగి వెళ్లిపోతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. అందుకే మేం ఎన్నికల్లో ఓటు వేయొద్దు అనుకుంటున్నాం. ఓట్లు అడగటానికి మా ఊరికి ఎవ్వరు రావొద్దు." - గ్రామస్థులు
Mailaram Village Problem : గుట్ట మైనింగ్‌పై అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అందుకే తాము ఎన్నికల్లో ఓటు వేయకుండా బహిష్కరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. గుట్టపై పురాతన ఆలయాలు, వన్య ప్రాణులకు గ్రాసానికి అదే ఆధారమని, ఇప్పుడు దీన్ని తవ్వితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, డంపింగ్ యార్డ్లు ఉన్నాయని తెలిపారు.
మైనింగ్ చేస్తే గుట్టపై ఉన్న చెట్లు నాశనమై పర్యావరణానికి హానీ జరుగుతుందని, ఊరు పక్కనే చెరువు ఉందని దానిపై ఆధారపడి వేలాది మంది మత్య్సకారులు జీవనం సాగిస్తున్నారని చెప్పారు. గుట్టపై అక్రమంగా ఇచ్చిన మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని లేకుంటే తాము శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
గొత్తికోయల గ్రామ బహిష్కరణ.. బెండలపాడు పంచాయతీ తీర్మానం
ఓటింగ్‌కు దూరంగా పల్లెలు - నిర్మానుష్యంగా పోలింగ్ కేంద్రాలు - ఇదే కారణం!