Mahashivratri Celebrations 2024 : యాదాద్రి మహా పుణ్యక్షేత్రంలో అనుబంధంగా కొనసాగుతున్న శ్రీశ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. శివరాత్రి మహోత్సవాల సందర్భంగా యాదాద్రి శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో జాతర వైభవంగా సాగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రెడ్డి, యాదవుల ప్రభలను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ప్రారంభించారు.
సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రి గ్రామంలో గల ఎరకేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని సామూహిక అభిషేకాలు నిర్వహించారు. వెయ్యేళ్ల నాటి పిల్లలమర్రి దేవాలయానికి ప్రత్యేక విశిష్టత ఉండటంతో స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మహాశివరాత్రి (Mahashivratri) సందర్భంగా నల్గొండ జిల్లా పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో స్వామివారి కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు పాటిస్తే నీరసం అస్సలే రాదు!
Shivratri Celebrations Telangana 2024 : హనుమకొండలోని చారిత్రక వేయిస్తంభాల గుడిలో (Thousand Pillar Temple) శివరాత్రి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. శివరాత్రి బ్రహ‌్మోత్సవాలను శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ ప్రారంభించగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, సీపీ అంబర్ కిషోర్ ఝా వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఒక పక్క ఆలయం విద్యుత్ కాంతులతో విరజిమ్ముతుంటే మరో పక్క నూతనంగా నిర్మించిన కల్యాణ మండపం రంగురంగుల పూలతో కనువిందు చేస్తుంది. శివపార్వతుల కల్యాణంతో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపం భక్తులకు అంకితం చేశారు. ఉదయం 4 గంటల నుంచి స్వామి వారికి విశేష పూజలు ప్రారంభమయ్యాయి.
మహాశివరాత్రి సందర్భంగా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఫౌండేషన్ ఛైర్మన్ రాకేశ్‌రెడ్డి తెలిపారు. ఐనవోలు మల్లికార్జున స్వామి వారి దేవాలయం ఉత్సవాలకు ముస్తాబైంది. సింహవాహన సేవ అనంతరం ఆలయ ప్రాంగణంలో పెద్దపట్నం నిర్వహించనున్నారు. శివరాత్రి వేళ గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున ఐనవోలుకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
ఇంట్లో శివలింగం ప్రతిష్ఠిస్తున్నారా? - ఈ నియమాలు తప్పనిసరి!
మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ వరంగల్ రీజియన్ నుంచి ప్రముఖ శైవ క్షేత్రాలు కాళేశ్వరం, వేములవాడ, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి ప్రభుత్వ విప్ శ్రీనివాస్‌తో కలిసి బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అద్దాల మండపంలో అర్చకులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ క్రమంలోనే ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించే శివరాత్రి వేడుకలకు వచ్చే భక్తులకు ఉచిత బస్సు సర్వీసును, అల్పాహారాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు.
Maha shivratri 2024 : ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కాళేశ్వరంలో మహశివరాత్రి ఉత్సవాలు (Shivratri Celebrations) ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడ్రోజుల పాటు జరిగే వేడుకలు నిన్న వైభవంగా ప్రారంభం కాగా శుక్రవారం శివపార్వతుల కల్యాణోత్సవం జరగనుంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో గోదావరి తీరానికి వెయ్యి అడుగులు ఎత్తులో ఉన్న శ్రీకనక సోమేశ్వరస్వామి ఆలయం శివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. పండుగను పురస్కరించుకుని నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. చివరి రోజు స్వామివారి రథయాత్ర జరగనుండగా. శివభక్తులు సైతం ఇక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చి దీక్ష విరమణ చేసి, మొక్కులు చెల్లించుకుంటారు.
శ్రీకాళహస్తీలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు- ఆకట్టుకున్న కళాకారుల నృత్య ప్రదర్శనలు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని ప్రసిద్ధ శ్రీస్వయంభూ రాజేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయం మహాశివరాత్రికి ముస్తాబైంది. ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారు.
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు : మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Governor Tamilisai Soundara Rajan) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శివుణ్ణి ఆరాధించే కోట్లాది మంది భక్తులకు శివరాత్రి అత్యంత ప్రాధాన్యమైన రోజుగా పేర్కొన్నారు. ఈ రోజు చేసే జాగరణకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందన్నారు. ఈ పండుగ ప్రజలలో ప్రేమ, అభిమానం, సహనం, సోదరభావం పెంపొందిస్తుందని తమిళిసై సౌందర రాజన్ ఆకాంక్షించారు.
శివుడికి బిల్వపత్రం సమర్పణ - ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా?