Mahabubnagar MP Candidates : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పార్లమెంటు ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైంది. 3 ప్రధాన పార్టీలు బలంగా ఉన్న తరుణంలో ఆయా పార్టీలకు చెందిన నేతలు టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ నుంచి పోటీ చేసేందుకు నలుగురు ఆశావహులు ఇప్పటికే అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నారు.
Telangana Parliament Elections 2024 : వీరిలో ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో పాలమూరు న్యాయ యాత్ర పేరుతో ఇప్పటికే పాదయాత్ర చేపట్టారు. వీరితో పాటు మహబూబ్‌నగర్ కాంగ్రెస్ నాయకులు సంజీవ్ ముదిరాజ్, ఎన్.పి.వెంకటేశ్, ఆదిత్య రెడ్డి, కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. అటు నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు 26 మంది దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎంపీలు మల్లు రవి, మందా జగన్నాథం, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఆయన సోదరుడు వినోద్ కుమార్ సహా మరికొందరు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మల్లు రవికి ఇప్పటికే దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా అవకాశం కల్పించగా, పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి అవసరమైతే ఆ పదవిని వదులుకుంటానని చెబుతున్నారు.
కంచుకోటను మరోసారి కైవసం చేసుకునేందుకు 'హస్తం' పక్కా ప్లాన్ - నిజామాబాద్ బరిలో ఆ అభ్యర్థి!
Mahabubnagar BJP MP Candidates : ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన నాగర్‌కర్నూల్ నుంచి బీజేపీ టికెట్‌ను ఆ పార్టీ నాయకురాలు బంగారు శృతి ఆశిస్తుండగా, ఇక్కడి నుంచి పార్టీలో పెద్దగా పోటీలేదు. కానీ మహబూబ్‌నగర్ స్థానానికి మాత్రం తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడి నుంచి బరిలోకి దిగేందుకు హేమాహేమీలు పోటీపడుతున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి బండారు శాంతికుమార్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణ ఈసారి కచ్చితంగా గెలుస్తానంటూ, మరోసారి బరిలో దిగాలని భావిస్తున్నారు.
మరోవైపు బీసీ కేటగిరికి చెందిన నేత, పార్టీ నాయకత్వం సూచనతో గతంలో 2 సార్లు ఎంపీ టికెట్ వదులుకున్న బండారు శాంతికుమార్ తగ్గేదేలే అంటున్నారు. ఈ సారి మాత్రం అవకాశాన్ని వదులుకునే ప్రసక్తే లేదంటున్న ఆయన, టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ నేత జితేందర్ రెడ్డి సైతం పాలమూరు తన అడ్డా అంటున్నారు. టిక్కెట్టు తనకే వస్తుందనే ధీమాతో ఉన్నారు.
Mahabubnagar BRS MP Candidates : మరోవైపు రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికలకు అందరి కంటే ముందుగానే సన్నాహాలు ప్రారంభించింది. అభ్యర్ధులను ప్రకటించకపోయినా అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ ఎంపీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తోంది. మహబూబ్‌నగర్ నుంచి ప్రస్తుత ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి మరోసారి బరిలో దిగాలని భావిస్తుండగా, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar MP Candidates : దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డికి పాలమూరు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అటు నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ టికెట్‌ను ప్రస్తుత ఎంపీ రాములు మరోసారి ఆశిస్తున్నారు. అచ్చంపేటలో ఓడిపోయిన గువ్వల బాలరాజు సైతం ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2 పార్లమెంటు స్థానాల్లోనూ అభ్యర్థులను బీఆర్ఎస్ నాయకత్వం మార్చుతుందా, పాతవారికే టిక్కెట్ కేటాయిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
అభ్యర్థులు ఎవరైనా ఈసారి లోక్‌సభ ఎన్నికల పోరు హోరాహోరీగానే సాగనుంది. ఉమ్మడి జిల్లాలోని 2 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో గల 14 అసెంబ్లీ స్థానాలకు 12 ఎమ్మెల్యేలను గెలుచుకున్న కాంగ్రెస్ 2 ఎంపీ స్థానాలనూ హస్త గతం చేసుకుంటామనే ధీమాతో ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రెండో స్థానానికి పరిమితమైన బీజేపీ ఈసారి విజయదుందుభి మోగించాలని వ్యూహాలు పన్నుతోంది. శాసనసభ ఎన్నికల ఫలితాలతో నైరాశ్యంలో ఉన్న బీఆర్ఎస్, ఎంపీ స్థానాలనైనా నిలుపుకుని పరువు కాపాడుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఇలా నోటిఫికేషన్ రాకపోయినా ఇప్పటికే అన్ని పార్టీల ప్రచారాలతో వేసవి ఆరంభంలోనే ఉమ్మడి పాలమూరులో ఎన్నికల వేడి మొదలైంది.
తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం - ఆ మూడు స్థానాలు సిట్టింగులకే
పార్లమెంటు పోరుకు కాంగ్రెస్ కసరత్తు - నేడు పీఈసీ భేటీలో అభ్యర్థుల ఎంపిక