Madanapalle Sub Collectorate Fire Accident Case: మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో దస్త్రాల కాల్చివేత ఘటనలో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. గత ప్రభుత్వ హయాంలో అడ్డు అదుపులేకుండా భూ ఆక్రమణలకు పాల్పడిన నేతలు ప్రభుత్వం మారడంతో దోపిడీని కప్పిపుచ్చేందుకు రెవెన్యూ ఫైళ్లను దహనం చేసినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చారు. ఘటన జరిగిన మరుసటి రోజే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రణాళిక ప్రకారం దస్త్రాలను దహనం చేశారని ప్రమాదవశాత్తు జరిగింది కాదని ప్రకటించడంతో వైఎస్సార్సీపీ నేతలు అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన రోజు అనుమానిత సిబ్బందిని విచారించగా వచ్చిన సమాచారం మేరకు వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు దృష్టి సారించారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి పాత్ర ఉన్నట్లు గుర్తించి ఆయన ఇంట్లో సోదాలు చేశారు. దీన్ని పసిగట్టిన మాధవరెడ్డి పరారయ్యాడు. ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు మాధవరెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా మదనపల్లెకు చెందిన పలువురు వైఎస్సార్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి మదనపల్లె పురపాలక వైస్ ఛైర్మన్ జింకా చలపతిని అదుపులోకి తీసుకున్నారు.
రాజంపేట ఎంపీ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి ప్రధాన అనుచరుడు బాబ్‌జాన్ అలియాస్ సెటిల్‌మెంట్ బాబ్‌జాన్ కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. దీన్ని పసిగట్టిన బాబ్‌జాన్ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎంపీ అనుచరుడు సీటీఎమ్-2 పరిధిలోని బండమీదపల్లె సర్పంచ్ భర్త అక్కులప్పను విచారణ కోసం డీఎస్పీ కార్యాలయానికి పిలిపించారు. ఆయన ఇంటిలోనూ సోదాలు నిర్వహించి కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకొన్నారు. అక్కులప్పతో పాటు ఓ ప్రధానపత్రిక మదనపల్లె ప్రతినిధిని ఫైళ్ల దహనం కేసులో అనుమానితునిగా పోలీసులు భావిస్తున్నారు.
జర్నలిస్ట్‌ల ముసుగులో ముగ్గురు వ్యక్తులు మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో మాధవరెడ్డి కార్యాలను చక్కబెట్టినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకోనున్నారు. గడచిన ఐదేళ్లలో భూముల ఆక్రమణలకు గురైన బాధితులు సబ్ కలెక్టరేట్‌కు తరలివచ్చారు. వారి నుంచి అధికారులు వినతులు స్వీకరించారు. మరోవైపు పెద్దిరెడ్డి నుంచి భూ బాధితులను రక్షించాలని ఫైళ్ల దహనం కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని వామపక్షాలు నిరసనకు దిగాయి.