Rain Alert in Telangana State : తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. రాబోయే వారం రోజులలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావారణశాఖ సంచాలకులు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.
నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రాంతం ఈ రోజు ఉదయం 8.30 గంటల సమయంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వద్ద నైరుతి, పరిసర పశ్చిమ - మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతుందని వివరించారు. దీని అనుబంధ చక్రవాతపు ఆవర్తనం ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని, ఎత్తు పెరిగే కొద్ది నైరుతి దిక్కుకు వాలి ఉందన్నారు. ఇది పశ్చిమ– నైరుతి దిశలో ప్రయాణించి రాగల 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని సంచాలకులు వెల్లడించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం - 2 రోజుల పాటు భారీ వర్షాలు!
రెయిన్ అలర్ట్ : అల్పపీడనం ఎఫెక్ట్ - నేటి నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు!