Look Out Notice To Sajjala Bhargav Reddy : వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై వైఎస్సార్ జిల్లా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డి సహా మరికొందరిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 8న పులివెందులలో వర్రా రవీందర్‌రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో భార్గవ్ రెడ్డిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. విదేశాలకు పారిపోతారనే అనుమానంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలంతో వీరిద్దరి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
YSRCP Leader Sajjala Bhargav Reddy Registered Case in Pulivendulua : అధికార పార్టీ నేతలే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా దూషణలకు పాల్పడుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను సమన్వయం చేస్తున్న ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్‌రెడ్డిపై కడప జిల్లా పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన దళితుడైన హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్‌రెడ్డితో పాటు మరో ఇద్దరిపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారు.
సజ్జల భార్గవ్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు - మరో ఇద్దరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు
వైఎస్సార్సీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్న రాష్ట్ర స్థాయి నేత అర్జున్‌రెడ్డితో పాటు పోలీసుల నుంచి తప్పించుకు పారిపోయిన వర్రా రవీందర్‌రెడ్డిపై కూడా కేసు నమోదైనట్లు పులివెందుల పట్టణ పోలీస్ అధికారులు పేర్కొన్నారు. వర్రా రవీందర్‌రెడ్డి ఐదేళ్లుగా టీడీపీ నేతలతో పాటు జగన్‌ను విమర్శించే వారిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. దీనిపై ప్రశ్నించిన తనను కులం పేరుతో దూషించారంటూ బాధితుడు హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిపైనా కేసు పెట్టారు.