Lok Sabha Election Police Bandobast In Hyderabad : రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3 వేల396 పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయి. ఇందులో 533 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 188 సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. పోలింగ్ కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ తరుణ్‌జోషి వెల్లడించారు.
ఇప్పటివరకు కమిషనరేట్‌లో నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు రూ.11.9 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. రూ.75.78 లక్షల విలువైన 12 వేల 240 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. రూ.1.95కోట్ల విలువైన గంజాయి, ఓపియం, ఎండిఎంఏ, హెరాయిన్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. కమిషనరేట్ పరిధిలో 8 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఉండగా, 29 ఫ్లయింగ్ స్వ్కాడ్లు, 25 స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు విధులు నిర్వర్తిస్తున్నాయి.
Election Arrangements In Telangana : సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటి వరకు 114 కవాతు ప్రదర్శనలు నిర్వహించారు. లైసెన్స్ కలిగి ఉన్న వెయ్యి 114 తుపాకులను పోలీసులు డిపాజిట్ చేసుకున్నారు. రౌడీషీటర్లు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారు, అనుమానితులు మొత్తం 4 వేల 892 మందిని పోలీసులు బైండోవర్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై 14 కేసులు నమోదు చేశారు.
కమిషనరేట్‌లో మొత్తం 8 వేల మందికిపైగా పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. అన్ని పోలింగ్ స్టేషన్‌లను జియో ట్యాగింగ్ చేసినట్టు రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. ఈ నెల 13న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరు ఓటు వేయాలని పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నారు.
"రాచకొండ పరిధిలో 34 లక్షల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. రేపు పోలీసు అధికారులతో పోలింగ్ పరికారాలను పంపిస్తాం. అలోట్ చేసిన పోలింగ్ బూత్‌లకు పోలీసులు వెళ్లి విధులు నిర్వహిస్తారు. రాత్రిళ్లు కూడా వారు బందోబస్త్ నిర్వహిస్తారు. నిషేధిత వస్తువులను పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకువెళ్లొద్దు. ఓటు వేసిన తర్వాత పోలింగ్ బూత్‌ల దగ్గర ఉండకూడదు." - తరుణ్ జోషి, రాచకొండ సీపీ