Liquor Sales with Fake Hologram Stickers : మద్యం సీసాలపై ముద్రించే సెక్యూరిటీ హాలోగ్రామ్స్ సరఫరా టెండర్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు విజిలెన్స్ కమిషన్ గుర్తించింది. ముందస్తు కుమ్మక్కు, కుట్ర మేరకే నిబంధనలకు విరుద్ధంగా హాలోగ్రామ్ టెండర్లు కట్టబెట్టారన్న ఫిర్యాదులపై గతంలోనే విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ పలు అవకతవకల్ని నిర్ధారించింది.
వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని గతేడాది సెప్టెంబరులో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించగా జగన్ ప్రభుత్వం దాన్ని తొక్కిపెట్టింది. ఏపీఎస్‌బీసీఎల్ ఎండీగా పని చేసిన వాసుదేవరెడ్డి ఈ వ్యవహారంలో ప్రధాన పాత్రధారి అన్న ఫిర్యాదులున్నాయి. మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశించడంతో నాటి విజిలెన్స్ కమిషన్ నివేదిక తాజాగా బయటకొచ్చింది. దీనిపై సీఐడీ దృష్టి సారించింది.
Holograms Scam in Excise Department : మద్యం సీసాలపై ముద్రించే హాలోగ్రామ్‌ల తయారీ, సరఫరా కోసం 2020 సెప్టెంబరులో ఏపీఎస్‌బీసీఎల్ టెండర్లు పిలిచి చెన్నైకు చెందిన కుంభత్ హాలోగ్రాఫిక్స్ సంస్థను L-1గా ఖరారు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ టెండరు కట్టబెట్టారని విజిలెన్స్ కమిషన్ గుర్తించింది. హాలోగ్రామ్‌ల తయారీ, ప్రింటింగ్, నంబరింగ్, సరఫరాలో కుంభత్ హాలోగ్రాఫిక్స్‌కు అనుభవం లేదు. ధ్రువీకరణ పత్రాలు నిజమైనవా? కావా అనేది నిర్ధారించుకోలేదు.
వరుసగా మూడేళ్ల 10 కోట్ల రూపాయల మేర వార్షిక టర్నోవర్ కలిగి ఉన్నామంటూ కుంభత్ సమర్పించిన నివేదికలు అసలైనవా? కావా అనేది సాంకేతిక మదింపు కమిటీ పరిశీలించలేదు. ఆ సంస్థకు సంబంధించిన జీఎస్టీ, ఆదాయపు పన్ను రిటర్న్‌లు పరిశీలించలేదు. నిపుణుల కమిటీ చైర్మన్ అయిన ఎక్సైజ్ శాఖ కమిషనర్, సభ్యులైన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఆర్థిక శాఖ ప్రతినిధి సంతకాలు సాంకేతిక మదింపు నివేదికలో లేకుండానే టెండర్లు ఖరారు చేసేశారు. నిపుణుల కమిటీ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను గల్లంతు చేశారు.
కుంభత్ సంస్థ హాలోగ్రామ్ల తయారీ, నంబరింగ్, కోడింగ్, బార్ కోడింగ్ అన్నీ విజయవాడలోనే చేపట్టి అక్కడ నుంచే సరఫరా చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా చెన్నై నుంచి సరఫరా చేశారు. ప్రభుత్వ దుకాణాల్లో సుంకం చెల్లించని మద్యాన్ని విక్రయించేందుకు వీలుగానే ఇలా చేశారని, దీని వెనక నకిలీ హాలోగ్రామ్‌ల దందా జరిగిందన్న అనుమానాలున్నాయి. ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణం, హర్యానాలో వెలుగుచూసిన మద్యం కుంభకోణాల్లోనూ ఇలా నకిలీ హాలోగ్రామ్లతోనే అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. సీఐడీ దర్యాప్తులో ఇవన్నీ ప్రధాన అంశాలు కానున్నాయి.
నెలన్నరగా అజ్ఞాతంలో వాసుదేవరెడ్డి - చర్యలు ఎప్పుడు ? - Former APSBCL MD Absconded