Leopard Roaming Near Bhimadolu Area in Eluru District : కొన్ని రోజులుగా ఏలూరు జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. భీమడోలు, ద్వారకాతిరుమల మండలాల్లో కనిపించిన చిరుత తాజాగా పెదవేగి మండలం జగన్నాథపురంలోని పంట పొలాల్లో సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అటవీ శాఖ ఏలూరు రేంజర్ కుమార్, పెదవేగి సీఐ కె.వెంకటేశ్వరరావు, ఎస్సై కె.రామకృష్ణలు తమ సిబ్బందితో జగన్నాథపురం వెళ్లి అక్కడ చిరుత అడుగులను పరిశీలించారు. అవి చిరుతవే అని నిర్ధారించారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
భీమడోలు మండలం పోలసానిపల్లి శివారు ఆంజనేయనగరం ప్రాంతంలో కూడా చిరుత కాలి గుర్తులు కనిపించడంతో పోలవరం కుడి కాలువ గట్టు వెంబడి అటువైపు వెళ్లి ఉంటుందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. గ్రామానికి చెందిన బాబి బుధవారం( అక్టోబర్ 23న) రాత్రి తన పంట పొలాల వద్దనున్న కోళ్ల ఫారం వద్ద నుంచి ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో చిరుత నిద్రిస్తూ కనిపించడం చూసి గ్రామానికి వచ్చి స్థానికులకు తెలిపారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో వారు పెదవేగి సీఐ, అటవీ శాఖ ఏలూరు రేంజర్‌కు సమాచారం ఇచ్చారు. వారు గురువారం (అక్టోబర్ 24న) ఉదయం జగన్నాథపురం వచ్చి కాలి అడుగుల్ని పరిశీలించి చిరుతవిగా నిర్ధారించారు. దీంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. చిరుతను పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేశారు.
'అది చిరుతే' - ఒంటరిగా బయటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక
"అదిగో చిరుత" రామప్ప కొండపై సంచారం - మూడు రోజులుగా భయం గుప్పిట గ్రామస్థులు