Lavu Sri Krishnadevarayalu asked SIT Officials to Investigate Palnadu Violence: పల్నాడు అల్లర్లపై సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారించాలని తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు కోరారు. ఒక పత్రికలో ఎస్పీ బిందుమాధవ్ కుటుంబానికి తమకు బంధుత్వం ఉంది అని రాసారన్న ఆయన తమకు ఎస్పీ బిందు మాధవ్‌కి ఎటువంటి బంధుత్వం లేదని తెలిపారు. తాను ఎప్పుడూ ఎస్పీతో ఫోన్ కూడా మాట్లాడలేదని అన్నారు. అవసరం అయితే తన కాల్ డేటాను నాతో పాటు ప్రయాణిస్తున్న ఎవరి కాల్‌డేటా అయినా చూసుకోవచ్చని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
పల్నాడు అల్లర్లపై తన ప్రమేయం ఉంటే తన పేరు ఛార్జ్ షీట్లో పెట్టుకోవచ్చని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. సమస్యాత్మక బూత్‌లు ఉన్నాయి అని చెప్పినా అక్కడ ఒక కానిస్టేబుల్ని మాత్రమే ఉంచారని విమర్శించారు. ఒక కులం, వర్గానికే నన్ను పరిమితం చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని అన్నారు. పోలింగ్ శాతం ఎక్కువైందంటే పల్నాడు ప్రజల కసి ఏంటో అర్థమైందా అని లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల ఎలాంటి హింస జరగలేదని కచ్చితంగా చెబుతున్నానని లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. వైసీపీ నేతల దుష్ప్రచారాలను పల్నాడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. మా లేఖను కూడా పరిశీలించాలని సిట్‌ను కోరుతున్నట్లు తెలిపారు. ఎంపీగా ఉండి మేమే చేశామన్న ఆరోపణలు ముమ్మాటికీ అసత్యమని కొట్టిపడేశారు. వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని కేవలం ప్రజల్లో టీడీపీకి వస్తున్న ఆదరణను చూడలేక మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని శ్రీకృష్ణదేవరాయలు దుయ్యబట్టారు.
జనంతో కలిసి తిరుగుతున్న నాపై దుష్ప్రచారం చేస్తారా అని లావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మావైపు నుంచి కాల్‌డేటా ఇస్తామని పరిశీలించాలని సిట్‌ను కోరుతున్నట్లు తెలిపారు. అల్లర్లకు ప్రభావితం చేసి ఉంటే నా పేరును ఛార్జిషీట్‌లో చేర్చుకున్నా ఇబ్బంది లేదని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. నా కాన్వాయ్ వాహనాలను ధ్వంసం చేశారని ఇకనైనా దుష్ప్రచారాలు మానుకోవాలని కోరుతున్నానని లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.