Last Day Of Election Nominations: నామినేషన్ దాఖలు చేసేందుకు ఇవాళ ఆఖరి రోజు కావడంతో ఇప్పటి వరకు నామపత్రాలు అందివ్వని నేతలంతా నేడు దాఖలు చేస్తున్నారు. కూటమి అభ్యర్థులు జనసంద్రంతో భారీ ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా కమలాపురంలో కూటమి అభ్యర్థి పుత్త కృష్ణచైతన్య రెడ్డి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక మూడు రోడ్ల కూడలి నుంచి వేల మంది కార్యకర్తలతో బాణాసంచా డప్పు వాయిద్యాల మధ్య భారీ ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నామపత్రాలు సమర్పించారు. ఈ ర్యాలీలో కడప ఎంపీ కూటమి అభ్యర్థి భూపేష్ రెడ్డి, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా పెదకూరపాడు కూటమి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ నామినేషన్ దాఖలు చేశారు. పెదకూరపాడు తహసీల్దార్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి భాష్యం ప్రవీణ్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. అమరావతి పట్టణం అంబేద్కర్ కూడలి నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పల్నాడు జిల్లా టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్, నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణదేవరాయలు, కూటమి నేతలు పాల్గొన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఈ సారి తెలుగుదేశం జెండా ఎగురవేడయం ఖాయమని భాష్యం ప్రవీణ్ ధీమా వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ర్యాలీ చేపట్టగా కూటమి శ్రేణులు భారీగా తరలివచ్చారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా మరో నలుగురితో కలిసి నామపత్రాలను ఆర్ఓకు అందజేశారు. ఈసారి ప్రొద్దుటూరులో టీడీపీ జెండా ఎగురవేస్తామన్నారు. ప్రొద్దుటూరులో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని వరదరాజుల రెడ్డి స్పష్టం చేశారు.
ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతుంది: పవన్ కల్యాణ్ - Pawan Kalyan Nomination Pitapuram
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కూటమి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరారు. అనపర్తి నియోజకవర్గం రామవరంలోని తన ఇంటి నుంచి ఆయన ర్యాలీగా బయలుదేరారు. మూడో సారి నామినేషన్ వేయబోతున్న రామకృష్ణారెడ్డి గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీ చేశారు. ఈసారి పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత నామినేషన్ దాఖలు చేశారు. రాప్తాడులోని ఆర్వో కార్యాలయంలో ఆమె నామినేషన్ పత్రాలను అందజేత చేశారు. రాప్తాడులో టీడీపీ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని పరిటాల సునీత అన్నారు. వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని సునీత పేర్కొన్నారు. కల్యాణదుర్గం నియోజకవర్గ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు నామినేషన్ వేసేందుకు బయల్దేరారు. కల్యాణదుర్గం టీడీపీ కార్యాలయం నుంచి కార్యకర్తలతో కలిసి అమిలినేని భారీ ర్యాలీ చేపట్టారు.
ఇసుకేస్తే రాలనంత జనం - టీడీపీ అభ్యర్థుల నామినేషన్లతో శ్రేణుల్లో జోష్ - వైసీపీలో నిరుత్సాహం