Land Allotment Policy for Industries: తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన 2015-20 పారిశ్రామిక విధానం ప్రకారం పరిశ్రమలకు అవుట్ రైట్ సేల్స్(ORS) కింద భూములు కేటాయించే నిబంధన ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ విధానంలో మార్పులు చేసింది. తొలుత లీజు విధానంలో భూములను కేటాయించి పదేళ్ల నిర్వహణ తర్వాత రిజిస్ట్రేషన్ చేసేలా "లీజు కం బై" విధానాన్ని తెచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రకటించిన రెండు పాలసీల్లోనూ అదే విధానాన్ని కొనసాగించింది.
లీజు విధానం వల్ల బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో ఇబ్బందులు వస్తున్నాయని పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక అసోసియేషన్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. 51 నెలలపాటు గుంభనంగా ఉన్న ప్రభుత్వం 2023 అక్టోబరు 30న జరిగిన మంత్రివర్గ భేటీలో మళ్లీ ఓఆర్ఎస్ పద్ధతినే తెస్తూ నిర్ణయం తీసుకొంది. అస్మదీయులకు లబ్ధిచేకూర్చేందుకే ఎన్నికల ముంగిట మార్పులు చేశారనే ఆరోపణలున్నాయి. సీఎం జగన్(CM Jagan) నేతృత్వంలోని పెట్టుబడులు, పారిశ్రామిక ప్రోత్సాహక మండలి పలు సంస్థల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
పెట్టుబడులకు జగన్ దెబ్బ - యువతకు శాపంగా మారిన వైసీపీ సర్కార్
ఐతే "లీజు కం బై" విధానంలో ఆయా సంస్థలకు భూముల రిజిస్ట్రేషన్ సాధ్యపడదు. ఈ ఉద్దేశంతోనే మళ్లీ పాత విధానం అమల్లోకి తెచ్చారనే ఆరోపణలున్నాయి.! జగన్‌కు బంధుత్వం ఉన్న షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ కంపెనీకి 8,348 ఎకరాల సేకరణకు ప్రభుత్వం అనుమతులిచ్చింది.! నెల్లూరు జిల్లా తమ్మినపట్నంలో జిందాల్ స్టీల్స్‌కు 860 ఎకరాలు, తాడేపల్లిలోని మెగా రిటైల్ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు 5 ఎకరాలు కేటాయించారు.
విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు కేటాయించిన 130 ఎకరాల రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి అప్పట్లో వైసీపీ ప్రభుత్వం విమర్శలు మూటగట్టుకుంది. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా అంతకుముందున్న ఓఆర్ఎస్ విధానాన్నే మళ్లీ తెచ్చింది. వైసీపీ నాలుగున్నరేళ్లపాటు అమలు చేసిన లీజు విధానం పరిశ్రమలకు పెద్దగా ఉపయోగపడలేదు. లీజు విధానాన్ని అమలు చేసి పెట్టుబడి భారాన్ని తగ్గిస్తామని అప్పట్లో వైసీపీ సర్కార్ చెప్పింది.
గ్రానైట్ పరిశ్రమలపై కక్షగట్టిన వైసీపీ ప్రభుత్వం- రాయితీల్ని గాలికొదిలేసిన జగన్ సర్కార్
అప్‌ఫ్రంట్ పేరుతో ప్రభుత్వం నిర్దేశించిన ధర మేరకు భూముల పూర్తి విలువను పారిశ్రామికవేత్తల నుంచి ఏపీఐఐసీ(APIIC) వసూలు చేసింది. పదేళ్లు గడిచిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేస్తామంది. దీంట్లో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించేది ఏముందో జగన్‌కే తెలియాలి. ఒకవేళ ఏదైనా కారణాలతో రెండు మూడేళ్ల తర్వాత భూములను ప్రభుత్వానికి సరెండర్ చేసినా అప్‌ఫ్రంట్ కింద చెల్లించిన మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు తిరిగి చెల్లిస్తుంది.
ఆ వ్యవధిలో భూముల మార్కెట్ విలువ పెరగటం వల్ల వచ్చే ప్రయోజనంలో పైసా కూడా పారిశ్రామికవేత్తలకు దక్కదు. ఇక భూముల లీజు డీడ్ ఆధారంగా బ్యాంకులు పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయి. ఫలితంగా పెట్టుబడి కోసం అధిక వడ్డీలకు బయటి నుంచే అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రకారం పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి భారం తగ్గలేదు సరికదా? రివర్స్‌లో వడ్డీ భారం పెరిగింది.