Story On Laknavaram Lake Tourism : పర్యాటకదామం లక్నవరం మరిన్ని హంగులతో పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. సహజసిద్ధ అందాలతో అనుభూతులు పంచే ఈ పర్యాటక కేంద్రంలో వాటర్ గేమ్స్, అత్యాధునిక బోట్లు ఆహ్వానం పలుకుతున్నాయి. లాహిరి.. లాహిరి అంటూ నీటిపై విహరిస్తూ సందర్శకులు మైమరిచిపోతున్నారు. పర్యాటకులకు సరికొత్త అనుభూతి పంచేందుకు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయానికి మరో ఆకర్షణ తోడైంది.
పర్యాటకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విభిన్న రకాల బోట్లను నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో వాటర్ రోలర్‌తో పాటు మూడు రకాల బోట్లు ఉన్నాయి. నీటిలో వాటర్ రోలర్‌తో పాటు తిరుగుతూ పర్యాటకులు వింత అనుభూతికి లోనవుతున్నారు.
బోటులో విహరిస్తూ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు : పర్యాటకులను ఆకట్టుకునేలా ఆందుబాటులోకి తెచ్చిన పల్లకీ బోటు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పల్లకీని తలపిస్తున్న బోటులో విహరిస్తూ పర్యాటకులు మైమరిచిపోతున్నారు. కాళ్లతో తొక్కితే కదిలే పెడల్ బోటు సందర్శకలకు ఆహ్వానం పలుకుతోంది. పాతకాలంలో మాదిరిగా తెడ్ల సాయంతో ముందుకెళ్లేలా కయాకింగ్ బోట్లు ప్రకృతి ఒడిలో గడిపేందుకు రా రమ్మని పిలుస్తున్నాయి.
పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న లక్నవరం : చుట్టూ కొండల మధ్య జలాశయంలో బోటుల్లో విహరిస్తుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తోందని పర్యాటకులు చెబుతున్నారు. ప్రకృతి అందాలను చూస్తూ మైమరిచిపోతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ గేమ్స్ ఆడుతూ పిల్లలు సంతోషంగా గడిపారని తల్లిదండ్రులు చెబుతున్నారు. లక్నవరం సరస్సుకు పర్యాటక హంగులు అద్దినప్పటికీ భోజనం, వసతిపై పర్యాటక శాఖ మరింత దృష్టి సారించాలని సందర్శకులు కోరుతున్నారు.
వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? - ఈసారి జాలీగా 'తెలంగాణ మాల్దీవ్స్'కు వెళ్లిరండి