Allegations on Kurnool General Hospital Superintendent Doctor Prabhakar Reddy : ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. అందులోనూ వైద్యవృత్తిలో ఉన్నారు. ఆ విషయాన్ని మరిచి వైఎస్సార్సీపీతో మమేకమయ్యారు. నిత్యం జగన్‌ను కీర్తిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం, ఫార్వర్డ్ చేయడాన్ని ప్రవృత్తిగా చేసుకున్నారు. ఫక్తు వైెఎస్సార్సీపీ కార్యకర్తగా వ్యవహరించిన ఆయన పేరు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. తాను ప్రభుత్వ ఉద్యోగినన్న విషయాన్ని మర్చిపోయి వ్యవహరించిన ప్రభాకర్ రెడ్డి ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అవాకులు, చవాకులు పేలుతున్నారని కూడా విమర్శించారు. ఇలాంటి ఈయనకు నాటి ప్రభుత్వం కర్నూలు జీజీ హెచ్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది.
ఎంతో ప్రతిష్ఠాత్మక కర్నూలు సర్వజన వైద్యశాల సూపరిండెంట్‌గా పని చేస్తున్న డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్లుగా జగన్‌ను పొగుడుతూ పాటలు, పద్యాలు, కవితలు, చిన్నపాటి కథలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. కార్టున్లూ వేయించారు. జగన్‌ను దేవుడితో పోల్చారు. వీటికి వైద్యకళాశాల, సర్వజన ఆస్పత్రుల వాట్సప్ గ్రూపుల్లో ఇతర సామాజిక మాధ్యమాల్లో విస్త్రృత ప్రచారం కల్పించారు.
ప్రభాకర్‌రెడ్డి స్వామి భక్తిని మెచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీనియర్లందరిని పక్కన పెట్టి అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సిఫార్సుతో ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్ బాధ్యతలు కట్టబెట్టారు. పేరుకు ఇంఛార్జ్ అని పేర్కొన్నా ఆస్పత్రి పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే నడుస్తోంది. వాస్తవానికి అదనపు డీఎంఈ హోదా ఉన్న వైద్యులనే సూపరింటెండెంట్‌గా నియమించాలన్న నిబంధన అమలు చేయలేదు. బాధ్యతలు చేపట్టిన ప్రభాకర్ రెడ్డి కార్యాలయ సిబ్బందితో ''నేను పనిచేసేందుకు సిద్ధం మీరు సిద్ధమా'' అని జగన్ అన్న మాటలతో పోల్చి చెప్పడం గమనార్హం.
అధికారి స్వామి భక్తి - మహిళలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు
ఈ ఏడాది జూన్ 9న జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారని, ఆ కార్యక్రమానికి విశాఖ రావాలని వైద్యులకు పిలుపునిచ్చారు. ఆయన టీడీపీకి వ్యతిరేకంగా విమర్శలు కూడా చేశారు. 'మామా గాంధార సార్వ భౌమ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఎవరైనా తప్పుడు సమాచారం అవాకులు చవాకులు పేలితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారట' అని దివంగత ఎన్టీఆర్ బొమ్మతో పోస్ట్ పెట్టారు. జగనన్నే మన నమ్మకమని బతకాలిరా తమ్ముడు అని లోగో తయారుచేసి, అందులో ఫ్యాన్ గుర్తు ఉంచారు.
జగనన్న చల్లని దీవెనలు పేదలందరికీ అందాలని, సీబీఎస్ఈ సిలబస్‌లో చదివించాలని, తల్లిదండ్రులు జగనన్నకు మంచిపేరు తేవాలనీ పేర్కొన్నారు. బెండపూడి విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడితే పులిసిపోతారు. నాటునాటు పాట ఫంక్షన్లో హీరోలు అదే ఆంగ్లంలో మాట్లాడితే మా నాయనే మా బాబే అని మురిసి చంకలు గుద్దుకుంటారు. ఎంత కడుపు మంటారా పిల్లలవైన సామీ! అని కూడా ఓ పోస్టు పెట్టారు. ఎందుకిలా చేస్తున్నారు? వైద్యవృత్తిలో ఉన్నారు కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎదురు దాడికి చేశారని సమాచారం.
ఇంఛార్జ్ సూపరింటెండెంట్ పోస్టులోకి వచ్చిన ప్రభాకర్ రెడ్డి ఎన్నికలకు ముందు వరకు సాగించిన ప్రచారాన్ని ఉద్యోగులు ప్రస్తుతం గుర్తు చేస్తున్నారు. ఆయన భావజాలం పూర్తిగా వైఎస్సార్సీపీతో ఉన్నందున ఇప్పుడు ఆయనతో కలిసి ఎలా పని చేయగలమని వైద్యులు, సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. పర్యవేక్షకుడైన తర్వాత ప్రభాకరరెడ్డి వివాదాస్పద నిర్ణయాలపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో ఉన్న ఔషధాల కౌంటరును దూరంగా మార్చటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే వైఎస్సార్సీపీ అనుబంధ సంఘంగా ఉన్న అనంతపురం వారిని పిలిపించి వారి ఆధ్వర్యంలో నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చినా ఆయనకు వైకాపాపై అభిమానం పోలేదన్న విమర్శలున్నాయి. డాక్టర్ ప్రభాకరరెడ్డి వ్యవహారానికి సంబంధించిన వివరాలు ఇంటెలిజెన్స్ విభాగం సేకరించి ప్రభుత్వం చెంతకు చేర్చింది. గతంలో అందరూ బదిలీ అయినప్పటికీ ఆయన్ను మాత్రం అలానే ఉంచారు. వైఎస్సార్సీపీతో అంటకాగడంతో ప్రస్తుతం బదిలీ తప్పదని తోటి వైద్యులు పేర్కొంటున్నారు.
వైఎస్సార్సీపీ అక్రమ నిర్మాణాలపై బిగుస్తున్న ఉచ్చు - NOTICES TO YSRCP OFFICES