BRS Leader KTR On Farmhouse : తన పేరు మీద ఎలాంటి ఫాంహౌస్ లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. మిత్రుడికి చెందిన ఫాంహౌస్‌ను లీజుకు తీసుకుని ఉంటున్నట్లు వెల్లడించారు. ఎఫ్టీఎల్, బఫర్‌లో ఫాంహౌస్ ఉంటే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని తెలిపారు. ఒకవేళ తప్పు ఉంటే అక్రమ కట్టడాలు కూల్చివేస్తే తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్న కేటీఆర్ మంచి జరగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సిందేనన్నారు.
KTR Comments On Congress Leaders : మంత్రులు, పెద్దపెద్ద కాంగ్రెస్ నేతలు అక్రమంగా కట్టిన ఫాంహౌస్‌లు చూపిస్తానని కేటీఆర్ తెలిపారు. మంత్రి పొంగులేటికి ఎఫ్‌టీఎల్‌లో ఫాంహౌస్ ఉందని ఆరోపించారు. కేవీపీ, పట్నం మహేందర్‌రెడ్డి, సుఖేందర్‌రెడ్డికి ఎఫ్‌టీఎల్‌లో ఫాంహౌస్ ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫాంహౌస్ ఉన్నట్లు ఆరోపించారు. తప్పు జరిగితే కూల్చివేతకు దగ్గరుండి సహకరిస్తానన్న కేటీఆర్ అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తప్పు తాను చేసినా కాంగ్రెస్ వాళ్లు చేసినా చర్యలు తీసుకోవాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. తన అఫిడవిట్లో ఏముందో పబ్లిక్ డాక్యుమెంట్ చూసుకోవచ్చన్నారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రేపు చేవెళ్లలో బీఆర్ఎస్ చేపట్టే నిరసనలో పాల్గొంటానన్నారు.
"ఫాం హౌస్‌ను నేను లీజు మీద తీసుకున్న మాట వాస్తవం. ఒక వేళ అది ఎఫ్‌టీఎల్‌లోనే బఫర్లోనే ఉంటే నామిత్రుడికి చెప్పి దగ్గరుండి నేను కూలగొట్టించి వస్తా. తప్పుంటే ఆ నిర్మాణాలను కూల్చండి దాంట్లో నష్టమేమి లేదు. కానీ అక్కడ నుంచే నేరుగా నాతో రండి. మంత్రులు, పెద్దపెద్ద కాంగ్రెస్ నాయకులు ఎఫ్‌టీఎల్‌లో, బఫర్లలో కట్టిన రాజభవనాలను చూపిస్తాను. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరం కూడా నేను చూపిస్తా" - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
జన్వాడ ఫాం హౌస్‌పై హైకోర్టులో పిటిషన్ : జన్వాడ ఫాం హౌస్ కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ప్రదీప్‌రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. జన్వాడ ఫాంహౌస్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉండటంతో కూల్చే అవకాశం ఉందని పిటిషన్లో తెలిపారు. హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని హైకోర్టులో ప్రదీప్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, హైడ్రా కమిషనర్లను చేర్చారు. అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను, శంకర్పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజినీర్‌ను కూడా ప్రతివాదులుగా తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే న్యాయస్థానం స్టే ఇవ్వకుండా హైడ్రా తీసుకున్న చర్యలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.