KTR Letter To Rahul Gandhi : ఎన్నికల సమయంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు షరతుల పేరుతో కేవలం 40 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి, రుణమాఫీ అవకతవకల గురించి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలకు కేటీఆర్ లేఖ రాశారు. రూ.40 వేల కోట్ల రుణమాఫీ అని చెప్పి, కేవలం రూ.17 వేల కోట్లకు పైగా రుణమాఫీతో రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లక్షల మంది రైతులు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపైన ఆందోళనలు చేస్తున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Rythu Runa Mafi In Telangana : అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మబలికి, మూడు విడతలుగా మోసం చేస్తూ చివరికి రైతులను ఉసూరుమనిపించారని తెలిపారు. 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, కేవలం 22 లక్షల మందికి తూతూమంత్రంగా చేయడం కాంగ్రెస్ సర్కారు అసమర్థతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందన్నారు. కాంగ్రెస్ సర్కారు తన వైఖరి మార్చుకొని రాష్ట్రంలోని అన్నదాతలందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, అన్నదాతల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే వారి తరఫున కాంగ్రెస్ పార్టీపైన పోరాడతామని లేఖలో పేర్కొన్నారు.
సర్వాయి పాపన్న జయంతి సందర్బంగా : మరోవైపు రాజన్న సిరిసిల్లలో శాంతినగర్ బైపాస్ రోడ్డులో సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూల మాలవేసి కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాధికారం కొరకు పాటుపడిన మహానుభావుడు పాపన్న గౌడ్ అని భారత దేశానికి స్వాతంత్రం, తెలంగాణలో ఉన్న నిరంకుశ పాలనకు చమర గీతం పాడింది పాపన్నే అని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలనే సంకల్పంతో గౌడన్నల సంక్షేమం కోసం ఆనాడు కేసీఆర్ ఎన్నో మంచి పనులు చేశారని తెలిపారు. గౌడన్నల కోసం చెట్లపై పన్నులు తీసేసి వారి కుల వృత్తిని ఆదుకున్నామని తెలిపారు. గౌడ కులస్థులకు వైన్ షాపుల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పించామని అన్నారు. గత ప్రభుత్వంలో నీరను ప్రోత్సహించి, ట్యాంక్‌బండ్‌పై నీరా కేఫ్ పెట్టి నీరా వల్ల ఉపయోగాలను ప్రజలకు చెప్పడం జరిగిందని, దానివల్ల ఉపాధి కూడా కల్గిందని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీయే : కేటీఆర్ - KTR Comments On CM Revanth Reddy