KTR on Medigadda Tour : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాలు, ప్రభుత్వ కుట్రను వివరించడంలో భాగంగా రేపు మేడిగడ్డతో పాటు అన్నారం ఆనకట్టలకు(Annaram Barrage) బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వెళ్తున్నట్లు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. మేడిగడ్డ పర్యటన నేపథ్యంలో ఇష్టాగోష్టిలో పలు విషయాలపై కేటీఆర్ మాట్లాడారు. ఇప్పటికీ ప్రాణహిత నుంచి రోజుకు 5000 క్యూసెక్కుల నీరు వృధాగా పోతోందని అన్నారు.
తమతో పాటు కొందరు నీటిపారుదల నిపుణులు కూడా వస్తారని, మరికొంత మంది నిపుణులు తర్వాత వెళ్తారని కేటీఆర్(KTR) తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల్లో మేడిగడ్డ లాంటి ఘటనలు మొదటివి కావన్న ఆయన, ఇదే చివరిది కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇటువంటివి జరిగినపుడు ప్రభుత్వాలు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి కానీ, రాష్ట్ర ప్రభుత్వం 83 రోజుల్లో ఆరోపణలు, శ్వేత పత్రాలు, కాలయాపన తప్ప మరమ్మత్తులపై ఎలాంటి దృష్టి పెట్టలేదని ఆక్షేపించారు.
BRS Medigadda Tour : మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఎన్‌డీఎస్‌ఏ వాళ్లు కనీసం నమూనాలు కూడా తీసుకోలేదని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పేవి అన్నీ వాస్తవాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వాల గురించి చాలా చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ఎన్‌డీఎస్‌ఏ కనీసం ఆనకట్ట కిందకు కూడా వెళ్ళలేదని అన్నారు. సెన్స్ ఎవరికి లేదో ప్రజలకు తెలుసంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించిన ఆయన, ప్రజలకు నీళ్ళు ఇవ్వాలన్న కామన్ సెన్స్ లేదని అన్నారు.
సమస్యను గుర్తించి ప్రభుత్వం పరిష్కరించాలి తప్ప పోటీగా మేము పాలమూరు పోతామని చెప్పడం దృష్టి మరల్చడమే అని కేటీఆర్ పేర్కొన్నారు. మార్చి 31 తర్వాత నీరు ఇచ్చే పరిస్థితి లేదు, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్న ఆయన, అవకాశం ఉండి కూడా నీళ్ళు ఇవ్వకపోవడం కిరాతకమని ఘాటుగా వ్యాఖ్యానించారు. చేత కాకపోతే తప్పుకొని మాకు ఇస్తే చేసి చూపుతామని హరీశ్‌రావు అన్నారని గుర్తు చేశారు.
రేవంత్‌కు కేటీఆర్ ఛాలెంజ్ - మల్కాజిగిరి ఎంపీ బరిలో తేల్చుకుందామంటూ సవాల్
మేడిగడ్డ విషయమై నిపుణుల కమిటీ వేసి నాలుగు నెలల్లో మరమ్మత్తులు చేయాలని, భేషజాలు లేకుండా ముందుకు వచ్చి పనులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు. పాలమూరు- రంగారెడ్డిలో కేవలం కాల్వలు తవ్వి నీళ్లు ఇవ్వాలన్న కేటీఆర్, పోటీ యాత్రలు కాలయాపన, వృధా ప్రయాస అని అన్నారు. సునీల్ కనుగోలు సలహాలు తీసుకుంటున్న కాంగ్రెస్ నేతలకు, తమ సలహాలు అవసరం లేకపోతే విజ్ఞులు, నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు.
వెదిరె శ్రీరామ్ భువనగిరి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న ఆయన అనుమతులు ఇచ్చిన వాళ్ళు శుంఠలు, శ్రీరాం తెలివైన వారా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి మోదీ, బీజేపీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆ పార్టీ నేతలు మళ్లీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓఆర్ఆర్ టోల్ అంశం సహా ఏ అంశంపై అయినా విచారణ వేసుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
రేవంత్ సాబ్ మీరిప్పుడు ముఖ్యమంత్రి - మరిచిపోయిండ్రా ఏంది? : కడియం
కాళేశ్వరంపై సీఎం కుట్ర చేస్తున్నారు - మార్చి 1 నుంచి బీఆర్ఎస్ చలో మేడిగడ్డ : కేటీఆర్