KRMB Meeting Postponed to 12th April : కృష్ణానది ప్రాజెక్టులలో నీటిమట్టాలు పడిపోతున్న వేళ, నీటిఎద్దడిని ఎదుర్కోవడం కోసం చర్చించతలపెట్టిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఈనెల 12వ తేదీకి వాయిదా పడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీలు ఇరువురు హాజరు కావాలని కేఆర్ఎంబీ(KRMB) సభ్య కార్యదర్శి డీఎం రాయిపురే కోరారు. ఇవాళ తలపెట్టిన సమావేశానికి రెండు రాష్ట్రాల ఈఎన్సీలు హాజరు కాలేదు. దీంతో సమావేశాన్ని ఈనెల 12వ తేదీకి వాయిదా వేశారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీరు, రెండు రాష్ట్రాల తాగునీటి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. రానున్న రోజుల్లో ఎదురయ్యే నీటి ఎద్దడిని ఎదుర్కొనే విషయమై సమావేశంలో చర్చ జరగనుంది. తెలంగాణకు కేటాయించిన వాటా కంటే ఇప్పటికే ఏడు టీఎంసీలకు పైగా అదనపు నీటిని వాడుకుందని ఆంధ్రప్రదేశ్ తెలిపింది. అటు 8వ తేదీ నుంచి సాగర్ కుడి కాలువ ద్వారా రోజుకు 5500 క్యూసెక్కుల చొప్పున తమకు ఐదు టీఎంసీల నీరు విడుదల చేయాలని ఏపీ ఇప్పటికే కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది.
ఇదివరకే బుధవారం జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కోరాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాలు కేఆర్ఎంబీకి లేఖ రాశాయి. దీంతో త్రిసభ్య సమావేశం జరిగే అవకాశం లేకుండా పోయింది. ఇవాళ నిర్వహించాలనుకున్న సమావేశానికి ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు హాజరుకాకపోవడంతో వాయిదా పడింది.
Nagarjuna Sagar water released for Left Canal : మరోవైపు రాష్ట్రానికి నాగార్జుసాగర్ ఎడమ కాలువ ద్వారా ఎన్ఎస్పీ అధికారులు నీటి విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేసవి అవసరాల నిమిత్తం తాగు నీటి దృష్ట్యా మాత్రమే నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 2500 క్యూసెక్కుల మేరకు నీటి విడుదల కొనసాగుతోంది. సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న రిజర్వాయర్లను తాగునీటి కోసం నింపనున్నారు.
ఇదివరకే సాగర్ నుంచి ఏపీకి తాగునీటి కోసం నీటిని విడుదల చేశారు. ఫిబ్రవరి 29న కేఆర్‌ఎంబీ అధికారులు నాగార్జునసాగర్ నుంచి కుడి కాలువ ద్వారా నీటిని వదిలారు. వేసవి దృష్ట్యా నీరు విడుదల చేయాలన్న ఏపీ ప్రభుత్వం అభ్యర్థన మేరకు, కేఆర్‌ఎంబీ అధికారులు నీటిని విడుదల చేశారు.