KRMB Orders Ap to Stop Taking Water From Nagarjuna Sagar Right Canal : నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలిపింది. ఈ మేరకు ఏపీ నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌నకు కేఆర్ఎంబీ సభ్యుడు ఆర్.ఎన్.శకువా లేఖ రాశారు. ఈ 12వ తేదీన జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు ఐదున్నర టీఎంసీల నీరు కేటాయించినట్లు కేఆర్ఎంబీ లేఖలో పేర్కొన్నారు.
అందుకు అనుగుణంగా ఈ నెల 12 నుంచి ఇవాళ ఉదయం వరకు 5.501 టీఎంసీల నీరు తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. ఈ మేరకు నీటి వినియోగ వివరాలను లేఖతో పాటు జతపరిచారు. కేటాయించిన మేరకు నీటిని వినియోగించుకున్నందున, సాగర్ కుడి కాల్వ నుంచి నీరు తీసుకోవడం ఆపాలని, గేట్లను మూసి వేయాలని కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలిపింది.
తెలంగాణ ఫిర్యాదుపై ఏపీ అభిప్రాయాన్ని కోరిన కేఆర్‌ఎంబీ : మరోవైపు నాగార్జునసాగర్ టెయిల్ పాండ్‌లోని నీటి వినియోగానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదుపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభిప్రాయాన్ని కోరింది. ఈ మేరకు ఏపీ ఈఎన్సీకి కేఆర్ఎంబీ లేఖ రాసింది. సాగర్ టెయిల్ పాండ్ నుంచి ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నాలుగు టీఎంసీల నీటిని వాడుకుందని బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. బోర్డు అనుమతి లేకుండా ఏపీ నీటిని తీసుకొందన్న తెలంగాణ, ఈ నెల 12వ తేదీన జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలోనూ టెయిల్ పాండ్ గురించి ఎలాంటి చర్చ జరగలేదని తెలిపింది. ఏపీ ఏకపక్ష చర్యతో విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలువరించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. తెలంగాణ ఫిర్యాదుపై కేఆర్ఎంబీ ఏపీ అభిప్రాయాన్ని కోరింది.
ఇటీవల ఉత్తర్వులు : ఈ నెల 12వ తేదీన జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశం నిర్ణయాల ఆధారంగా బోర్డు ఈ నెల 18న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు నాగార్జునసాగర్‌లోని 500 అడుగులపై ఉన్న 14 టీఎంసీల నీటిని రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించింది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు ఐదున్నర టీఎంసీలు కేటాయించగా, మిగిలిన నీరు హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల తాగునీటి అవసరాల కోసం వినియోగానికి అనుమతిచ్చింది.
ఏపీ, తెలంగాణకు 14 టీఎంసీల నీటి విడుదల - కేఆర్‌ఎంబీ ఉత్తర్వులు - KRMB Orders Release Of Sagar Water