Krishna Godavari Pavithra Sangamam Harathi : విజయవాడ శివారులో జల హారతుల పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కృష్ణా, గోదావరి నదులు కలిసే పవిత్ర సంగమాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక సంగమంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించారు. వివిధ శాఖల సమన్వయంతో 30 రోజుల్లో మొత్తం పనులు పూర్తి చేసి దసరా ఉత్సవాలకు ముందే సర్వం సిద్ధం చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
ఓవైపు కృష్ణమ్మ గలగలలు. మరోవైపు గోదారమ్మ పరవళ్లు. చుట్టూ ప్రకృతి సోయగాలు. ఆహ్లాదంగా గడిపేందుకు బోటింగ్ పాయింట్లు. వీటి మధ్య నిత్య నీరాజనంగా నదీమతల్లికి పవిత్ర హారతులు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అదో నిత్య వైభవం. నిత్యహారతులతో నాడు కాంతులీనిన పవిత్ర సంగమం వైఎస్సార్సీపీ ఏలుబడిలో సమస్యల సంగమంగా మారిపోయింది.
జలహారతులు పునరుద్ధరించి పవిత్రసంగమానికి పూర్వవైభవం తేవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రుల బృందం ఇప్పటికే ఆ ప్రాంతాన్ని సందర్శించి తగు సూచనలు చేసింది. జలహారతుల నిర్వహణ, సమన్వయ బాధ్యతల్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనకు అప్పగించింది. పవిత్రసంగమం ఘాట్‌ను సందర్శించిన ఆమె సంబంధిత శాఖల వారీగా పనుల విభజన చేశారు.
ఘాట్ ప్రాంతాన్ని రిపేర్ చేయాలి. అక్కడికి రోడ్డు సదుపాయం కూడా సరిగా లేదు. సీసీటీవీ కెమెరాలను పునరుద్ధరించాలి . దసరా ఉత్సవాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వారికి మంచినీటి, ఇతర సదుపాయాలు కల్పించాలి. వివిధ శాఖల సహకారంతో వీటిని పునరుద్ధరిస్తాము - సృజన, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
హారతులిచ్చేందుకు గతంలో నదిలో వేయించిన ఆరు తేలాడే పంట్లు పాడయిపోయాయి. వీటికి మరమ్మతులు చేసి అలంకరించాల్సి ఉంది. ఘాట్ ప్రాంతం మొత్తం వెలుగులు విరజిమ్మే లైటింగ్, సౌండ్ సిస్టమ్ సహా ఇతర ఏర్పాట్లు చేయాల్సి ఉంది. నదీ ప్రవాహం లక్ష క్యూసెక్కులు దాటితే పంటులలో హారతి నిర్వహణ కష్టమని, అప్పుడు ఒడ్డున నిలబడి క్రతువు నిర్వహించే ఏర్పాట్లు ఉండాలని జలవనరులశాఖ అధికారులు సూచించారు. భక్తుల సౌలభ్యం మేరకు ఘాట్‌లో వేడెక్కని గ్రానైట్ వేసేలా అంచనాలు సిద్ధం చేశారు. అవన్నీ సమకూర్చే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు దుర్గగుడి ఈవో కె.ఎస్. రామరావు చెప్పారు.
కృష్ణా హారతి పునఃప్రారంభం - మంత్రి ఆనం నేతృత్వంలో జీఓఎం సమావేసం - Ministers Committee Meeting
పవిత్రసంగమాన్ని భవిష్యత్‌లో ఆధ్యాత్మిక, పర్యాటక సంగమంగా తీర్చిదిద్దేలా దీర్ఘకాలిక ప్రణాళికలూ రచించారు. దానికి 50 ఎకరాల వరకూ స్థలం అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఐతే ఆ ప్రదేశంలో ఆక్రమణలు అధికంగా ఉండడం వల్ల 30 నుంచి 35 ఎకరాల వరకు మాత్రమే స్థలం అందుబాటులో ఉంది. తిరుమల, ఇంద్రకీలాద్రి ఆలయాల పర్యవేక్షణలో ఓ గుడి నిర్మించాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. వారాంతాల్లో పవిత్ర సంగమంలో సాంస్కృతిక వైభవం ఉండేలా కూడా ప్రణాళికలు వేస్తున్నారు. దసరా ఉత్సవాలకు ముందే నవహారతులు సిద్ధం చేసేలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి.
అధ్వానంగా కృష్ణా పుష్కర ఘాట్లు - కూటమి ప్రభుత్వంపైనే భక్తుల ఆశలు - Krishna Pushkara Ghats