Kotamreddy Sridhar Reddy on YSRCP: నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్ధి వియసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీరును తీవ్రంగా విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడటంతో వైసీపీ నాయకులు నీచంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఓటమి భయంతో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తల మీద సోషల్ మీడియాలో దాడులు చేస్తున్నారని అన్నారు.
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ను ఆదర్శంగా తీసుకునే వ్యక్తిత్వ హననం చేస్తున్నారని, ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.
మానసికంగా దాడి చేస్తున్నారు: కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సోషల్ మీడియా ద్వారా వైసీపీ వేధింపులకు పాల్పడుతోందని కోటంరెడ్డి ధ్వజమెత్తారు. షర్మిల, సునీతపైనా సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కొనుగోలు చేసి ప్రతిపక్షాలపై మానసికంగా దాడి చేస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ చెల్లెలు షర్మిల, సునీతపై సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్, సలహాదారుల ఆదేశాలతో ఆఖరుకు వాళ్ల సొంత పత్రికలో కూడా మాట్లాడిస్తున్నారని విమర్శించారు.
MLA Kotam: సీఎం మూడు సంతకాలను గుర్తు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి.. ఏమిటంటే?
టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగడమే పాపమా: ప్రసన్న కుమార్ రెడ్డి ఓటమి భయంతో మాట్లాడుతున్నారన్నారు. సొంత చెల్లెళ్లపైనే మానసిక వేధింపులు సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారని అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణిని ఆలయానికి పిలిచి యాగం చేయించి వారిద్దరిని ఆదిదంపతులు అని కీర్తించిన ప్రసన్న కుమార్ రెడ్డి, ఈ రోజు నోటికి వచ్చినట్లు మాడ్లాడుతున్నారని అన్నారు. ప్రశాంతిరెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగడమే పాపమా అని ప్రశ్నించారు. ప్రశాంతిరెడ్డిని విమర్శిస్తే ఇకముందు తాము సమాధానం చెబుతామని హెచ్చరించారు.
ఏడాది క్రితమే తాను బయటపెట్టా: నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేసి వచ్చి పోటీ చేయాలని కోటంరెడ్డి అన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ తప్పదని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఏడాది క్రితమే తాను బయటపెట్టానని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
జగన్, విజయసాయిరెడ్డిని ప్రజలు తరిమేశారు: ప్రసన్నకుమార్‌రెడ్డి సభ్యత మరచి మాట్లాడుతున్నారని నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఓటమి భయంతోనే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, విజయసాయి రెడ్డి ఓటు నేటికీ విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఉందని అన్నారు. విశాఖ నుంచి జగన్, విజయసాయిరెడ్డిని ప్రజలు తరిమేశారని రూప్‌కుమార్ యాదవ్ విమర్శించారు.
అనిల్‌కు మాటలు ఎక్కువ, మ్యాటర్ తక్కువ - విజయసాయిరెడ్డి ఓడిపోవడం ఖాయం: కోటంరెడ్డి