Komaram Bheem Project Problems : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్టు ఆనకట్టకు భారీ గండి, కడెం ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడం, మరోసారి గేట్లు స్తంభించి నీరు ప్రాజెక్టు పైనుంచి పోటెత్తిన ప్రవాహం, గతేడాది ములుగు జిల్లాలో గండిపడిన బూర్గుపేట చెరువు, సమీప గ్రామాలను ముంచెత్తిన వరద, ఇలా ప్రాజెక్టుల నిర్వహణలో వరుస వైఫల్యాలు కళ్లముందు కదులుతున్నా, నీటి పారుదల శాఖ అధికారులు మాత్రం కళ్లు తెరవడం లేదు.
అస్తవ్యస్త నిర్వహణతో ఆసిఫాబాద్ జిల్లాలోని కుమురం భీం ప్రాజెక్టు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 'అడ' ఆనకట్ట కుంగి రెండేళ్లు గడుస్తున్నా, ఇప్పటి వరకు అధికారులు ఆనకట్ట పటిష్ఠత, మట్టి నాణ్యత పరీక్షలకే పరిమితమయ్యారు. మరమ్మతుల జోలికి మాత్రం వెళ్లలేదు. వర్షాలతో కట్ట చివరి భాగం కూలుతుండగా, పెద్ద టార్పాలిన్ కప్పి మమ అనిపించారు. గత ప్రభుత్వ హయాంలో హడావిడి చేసిన అధికారులు తర్వాత పట్టించుకోలేదు. దీంతో ప్రాజెక్టు పరిస్థితి ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
కుమురం భీం ప్రాజెక్టు ప్రమాద ఘంటికలు : కుమురం భీం ప్రాజెక్టు ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు ఉంటే, ఆనకట్ట మరమ్మతుల దృష్ట్యా 5 టీఎంసీలనే కొనసాగిస్తున్నారు. భారీగా వస్తున్న వరదను కిందికి వదులుతున్నారు. ఏడాది క్రితం బిల్లులు చెల్లించకపోవడంతో ప్రాజెక్టుకు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అప్పటి నుంచి జనరేటర్ల సహాయంతో నిర్వహణను కొనసాగిస్తున్నారు. భారీగా వరద వచ్చిన సమయంలో జనరేటర్ మొరాయిస్తే ఆనకట్టకే ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. అస్తవ్యస్తంగా మారిన కుమురం భీం ప్రాజెక్టు నిర్వహణతో పరివాహక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
రూ.750 కోట్లతో 45 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో కుమురం భీం ప్రాజెక్టును నిర్మించారు. అయితే కాలువల నిర్మాణం పూర్తికాక ఆయకట్టుకు నీళ్లందడం లేదు. దీనికి తోడు బలహీనంగా మారిన ఆనకట్ట ఆందోళన కలిగిస్తోంది. ఏదైనా ఉపద్రవం ముంచుకొస్తే, తమ పరిస్థితి ఏంటని పరివాహక గ్రామాల ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
ప్రాజెక్టు కుంగి రెండేళ్లవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షాలతో ఆనకట్ట చివరి భాగం కూలుతుండగా, టార్పాలిన్ కప్పారు. గతంలో స్మితా సబర్వాల్ ఈ ప్రాజెక్టును సందర్శించారు. నిధులు విడుదల కాక ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టలేదు. భారీగా వస్తున్న నీటిని కిందకు వదులుతున్నారు. నీరు ఆగితే ప్రాజెక్ట్ కొట్టుకుపోయే ప్రమాదముంది. ఇప్పటికైనా అధికారులు గుర్తించి ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలి. - స్థానికులు