Bobbili woman as director of China Bank: ప్రపంచంలోని అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ) డైరెక్టర్‌గా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం వాడాడకు చెందిన కొల్లి భారతి(43) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ ప్రధాన కార్యాలయంలో ఆమె పనిచేస్తున్నారు. ఆమె తండ్రి కొల్లి సింహాచలం ఆర్మీ విశ్రాంత అధికారి. తల్లి లక్ష్మి గృహిణి. అతని ప్రథమ కుమార్తె భారతి చిన్నతనం నుంచి క్రమశిక్షణతో కష్టపడి చదువుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి అనుకున్నది సాధించిందని తండ్రి సింహాచలం వెల్లడించారు.
పిల్లల గురించి తండ్రి మాటల్లో: సైన్యంలో పనిచేయడంతో నాకు తరచూ బదిలీలు అయ్యేవి. భారతి మదనపల్లెలోని జేఎన్‌టీయూసీ అనుబంధ ఎంసీబీటీ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తిచేసింది. 1999లో బెంగళూరులోని హెచ్‌పీ, డెల్ కంపెనీల్లో పనిచేసింది. 12 ఏళ్ల క్రితం డెల్ సంస్థ మూడునెలల పనిపై అమెరికాకు పంపించింది. ఉద్యోగం చేసుకుంటూ అమెరికాలోని డ్యూ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తిచేసింది. తర్వాత ఐసీబీసీకి ఎంపికైంది. న్యూయార్క్‌లోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో నాలుగేళ్లుగా డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ఈ ఏడాది ‘రైజింగ్‌స్టార్ ఉమెన్’లో చోటు సాధించింది. మా రెండో బిడ్డ రూప డచ్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్‌గానూ, మూడో కుమార్తె సుష్మ యూకేలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గానూ పనిచేస్తున్నారు అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.