Khammam Girl Four Govt Jobs 2024 : అమ్మానాన్న పెళ్లి చేస్తామంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించాకే అని కచ్చితంగా చెప్పేసింది ఈ యువతి. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆరు ఏళ్ల పాటు అలుపెరుగకుండా పోరాడింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఉన్నా, లేకున్నా సాధన మాత్రం మానలేదు. ఎన్నో ఓటములూ, అవమానాలనూ దాటుకుని, ఎట్టకేలకూ విజయాల బాట పట్టింది. ఈసారి రాసిన ప్రతీ పరీక్షలోనూ ఎంపికయ్యి, నాలుగు సర్కారీ కొలువులు సంపాదించి ఆశయాన్ని నెరవేర్చుకుంది. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఈ యువతి పేరు శృతి. స్వస్థలం ఖమ్మం. తండ్రి ప్రభాకర్ పెయింటింగ్ పని చేస్తుంటారు. తల్లి పూలమ్మ ఖమ్మం పోలీస్ శిక్షణా కేంద్రంలో వంటమనిషిగా పనిచేస్తోంది.
ఒకేసారి 4 సర్కారీ కొలువులు : ఇంటర్ వరకూ గురుకులాల్లోనే చదువు పూర్తిచేసింది శృతి. అమ్మానాన్నల కష్టం చూస్తూ పెరిగిన ఈమె, డిగ్రీ చదివేటప్పుడే ప్రభుత్వ ఉద్యోగంపై గురి పెట్టింది. ఉద్యోగం దక్కించుకునే వరకూ వివాహ ప్రస్తావన తీసుకురావద్దని తల్లిదండ్రులను ఒప్పించి, ఆరు ఏళ్లపాటు సుదీర్ఘంగా శ్రమించింది. ఇప్పుడు ఒకేసారి 4 సర్కారీ కొలువులు దక్కించుకుని ఔరా అనిపిస్తోంది. 2018 నుంచి పోటీపరీక్షలకు చదవడం మొదలుపెట్టానని, లాక్‌డౌన్ సమయంలోనూ ఇంటినే లైబ్రరీగా మార్చుకుని ఆపకుండా సాధన చేశానని చెబుతోంది శృతి. మొదట్లో ఒకటి, రెండు మార్కుల తేడాతో ఉద్యోగాలు కోల్పోయినా నిరుత్సాహపడకుండా లోపాలను సరిచేసుకుంటూ ప్రణాళికతో చదివి ఇన్ని ఉద్యోగాలు సంపాదించానని అంటోంది.
'నేను ఆరు నుంచి పదో తరగతి వరకు గురుకుల పాఠశాలలో చదివాను. ఇంటర్మీడియట్ ఖమ్మంలో బీఆర్ అంబేడ్కర్ జూనియర్ కళాశాలలో చేశాను. గ్రాడ్యుయేషన్ మ్యాక్స్ కళాశాలలో ఫార్మసీ చేశాను. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో సోషియాలజీ చేశా. అందులోనే మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కూడా చేశాను.' - కోలపూడి శృతి.
Young Woman Got 4 Govt Jobs in Khammam : తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్, గురుకుల పాఠశాలలో లైబ్రేరియన్, గురుకుల డిగ్రీ కళాశాలలో లెక్చరర్, మహిళా శిశు సంరక్షణశాఖలో ఈవో ఉద్యోగాలు సాధించింది శృతి. ఇంకా గ్రూప్ 4లోనూ మంచి మార్కులు వచ్చాయని, టీఎస్‌పీఎస్సీ, పాలిటెక్నిక్ జేఎల్(Polytechnic JL) ఉద్యోగాలూ వచ్చే అవకాశం ఉందని ధీమాగా చెబుతోంది. వరుస అపజయాలను తట్టుకుంటూ పోటీ పరీక్షలకు తానెలా సన్నద్ధమయ్యిందో, ప్రభుత్వ నౌకరీ రావాలంటే ఏ మార్గాన్ని అనుసరిస్తే బాగుంటుందో వివరిస్తోంది శృతి. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా అమ్మానాన్నలు తనకు ఏ కష్టం రానీయలేదని, అందువల్లే ఆలస్యంగానైనా ఒకేసారి ఇన్ని ఉద్యోగాలకు ఎంపిక కాగలిగానని అంటోంది .
4 ఉద్యోగాలొచ్చినా ఓటు ఆ ఉద్యోగానికే : తల్లిదండ్రులతో పాటూ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న సోదరుడూ తన విజయాల్లో కీలకపాత్ర పోషించారని అంటోంది శృతి. కుమార్తెలను ఉన్నత స్థితిలో చూడాలనే కోరికతో, ఆర్థిక స్థోమతకు మించి చదువు చెప్పించామని అంటున్నారు శృతి తల్లిదండ్రులు. ఆశించినట్టుగానే తమ కుమార్తె ఇన్ని ఉద్యోగాలు సాధించడం గర్వంగా ఉందని చెబుతున్నారు. చిన్నప్పటి నుంచీ తనకు అధ్యాపక వృత్తి అంటే మక్కువని అందుకే వచ్చిన నాలుగు ఉద్యోగాల్లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగంలో చేరుతానంటోంది శృతి. భవిష్యత్తులో కచ్చితంగా సివిల్స్ లేదా గ్రూప్-1లో ఉద్యోగం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. పట్టుదలతో చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టమేమీ కాదని ఈమె చాటి చెబుతోంది.
నాలుగు ప్రభుత్వ కొలువులు సాధించిన నిజామాబాద్ యువతి
ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపికై అమ్మనాన్నల కలను నిజం చేసిన సూర్యాపేట యువకుడు