Rudra Homam with 280 Couples at Khairatabad Ganesh : విజ్ఞాలను తొలగించే విఘ్నేశ్వరుడికి వాడవాడలా పూజలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌లోని శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి వద్ద సైతం భారీ ఎత్తున ఆ బడా గణేశునికి పూజలు అందుతున్నాయి. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేలాది భక్తుల నడుమ ఇవాళ లక్ష్మీ గణపతి రుద్ర హోమం అంగరంగవైభవంగా నిర్వహించారు.
ఖైరతాబాద్ బడా గణేష్ 70వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 280 జంటలతో 70 హోమ గుండాల మధ్య ఈ లక్ష్మీ గణపతి రుద్ర హోమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ హోమం చేసినట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు.
సప్తముఖుడికి లక్ష రుద్రాక్షమాల : ఖైరతాబాద్‌లోని శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి వద్ద సోమవారం శివ పార్వతుల కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ఈ క్రమంలోనే భక్తులు మహా గణపతికి లక్ష రుద్రాక్షమాలతో అలంకరించారు. మరోవైపు ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు నగర ప్రజలే కాకుండా, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అలానే ప్రముఖులు సైతం మహాగణపతిని దర్శించుకుంటున్నారు. ఇక్కడకి వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసింది.
అత్యవసర పరిస్థితులు ఏమైనా ఎదురైతే వాటిని దృష్టిలో పెట్టుకొని అంబులెన్సులను సైతం ఏర్పాటు చేసింది. బడా గణపతిని దర్శనం చేసుకునే సమయంలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అడుగడుగున పోలీసుల పహారా కాస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందిలేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు.
నిత్యం వేలాది మంది గణపయ్యను చూడడానికి తరలి వస్తుండడంతో భద్రతను పూర్తిస్థాయిలో పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జంట నగరాల నుంచి వస్తున్న భక్తులతో బడా గణేశ్ ప్రాంగణమంతా కిటకటలాడుతోంది.
ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి వెళ్తున్నారా? - ఈ విషయం తెలుసా?