పురుగులున్న ఆహారాన్ని పెడుతున్నారని విద్యార్థుల ధర్నా - స్పందించిన అధికారులు - Kasturba Students Protest on Food - KASTURBA STUDENTS PROTEST ON FOOD
Kasturba School Students Dharna : పురుగులున్న ఆహారాన్ని పెడుతున్నారని కస్తూర్బా పాఠశాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. నారాయణపేట జిల్లాలో నాచారంలోని విద్యార్థులు నాణ్యమైన ఆహారాన్ని, తాగునీటిని అందించాలంటూ పెద్ద ఎత్తున రోడ్డుపై ఆందోళన చేయగా స్వయంగా పోలీసులే జిల్లా అధికారిణి వద్దకు తీసుకెళ్లారు.
Published : Aug 3, 2024, 3:10 PM IST
Kasturba School Students Protest on Food : నారాయణపేట జిల్లా కోస్గి మండలం నాచారం గ్రామంలో కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తమ పాఠశాలలో ఎన్నో రోజులుగా మెనూ ప్రకారం ఆహారం అందకపోవడంతో పాటు, పురుగుల ఉన్న ఫుడ్‌ను వండి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపల్‌కు ఎన్నోసార్లు విన్నవించినా తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో పాటు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
"మాకు మంచి ఫుడ్ పెట్టడం లేదు. ఉదయం పూట టిఫిన్ నుంచి రాత్రి పెట్టే భోజనం వరకు ఎందులో చూసినా పురుగులే. చివరకు తాగే నీటిలో సైతం పురుగులు, బల్లులు పడుంటాయి. అవి అలానే మాకు పెడతారు. వాటివల్ల చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. అయినా పట్టించుకోవటం లేదు. మా ప్రిన్సిపల్‌ను వెంటనే ఛేంజ్ చేయండి. మెనూ ప్రకారం ఫుడ్ ఉండటం లేదు. ఎన్నో సార్లు కంప్లైంట్ చేసిన పట్టించుకోవటం లేదు. ఇంట్లో వాళ్లను మా స్కూల్‌కు అనుమతించటం లేదు." -విద్యార్థినులు
నాణ్యమైన ఆహారాన్ని అందించాలి : కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో తాము అనారోగ్యం గురైన ఆసుపత్రికి చూపించలేని పరిస్థితి ఉందని విద్యార్థులు ఆరోపించారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి పాఠశాలలో ప్రిన్సిపల్ మార్చాలని, తమకు నాణ్యమైన ఆహారాన్ని, తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న కోస్గి సర్కిల్ ఇన్స్పెక్టర్ దశ్రు నాయక్ సిబ్బందితో విద్యార్థులు ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకుని న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
అయినా విద్యార్థులు శాంతించకపోవడంతో తమ సమస్యను మండల అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పోలీసులు చెప్పారు. అనంతరం విద్యార్థులను మండల కార్యాలయానికి ఓ ప్రైవేట్ వాహనంలో స్వయంగా పోలీసులే పంపించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా జీసీడీవో అధికారిణి పద్మ నళిని విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు శాంతించారు.