Kanakamedala Ravindra Kumar Letter to NHRC: సీఎస్ జవహర్ రెడ్డి, పీఆర్ అండ్ ఆర్డీపీఎస్ శశి భూషణ్, సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డిలపై జాతీయ మానవ హక్కుల సంఘానికి (National Human Rights Commission) టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఓ లేఖ రాశారు. పెన్షన్ పంపిణీ వ్యవహారంలో వృద్ధుల ఉసురు పోసుకున్న సీఎస్ జవహర్ రెడ్డి, పీఆర్ అంట్ ఆర్డీపీఎస్ శశి భూషణ్, సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
వాలంటీర్లను దూరం పెట్టి ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలిచ్చినా పట్టించుకోలేదని అన్నారు. ఏప్రిల్ నెలలో వృద్ధులను గ్రామ సచివాలయాలకు పిలిచి ఇబ్బందులు పెట్టి, 33 మంది వృద్ధుల మరణానికి కారణమయ్యారని కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడతారని, ఇతర ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని ముందే తాము సీఎస్ జవహార్ రెడ్డిని కోరినా పట్టించుకోలేదని మండిపడ్డారు.
డీబీటీ (Direct Benefit Transfer) ద్వారా కొంతమంది పెన్షన్‌దారులకు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడం సులభం కాదని గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి చెప్పినా పీఆర్ అండ్ ఆర్డీ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ పెడ చెవిన పెట్టారన్నారు. వైఎస్సార్సీపీకి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చాలనే దుర్మార్గపు ఆలోచనతో వృద్ధులపై కుట్ర పన్నారన్నారు. ఇంతటి దుర్మార్గాలకు పాల్పడని ఈ అధికారులపై తగు చర్యలు తీసుకోని మరణించిన వృద్ధుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం ఈ విషయాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలని కనకమేడల రవీంద్రకుమార్ లేఖలో పేర్కొన్నారు.
Kanakamedala Ravindra Kumar Comments: ఎప్పుడో నొక్కిన బటన్‌కు డబ్బులు వేసేందుకు ఇప్పుడు ఈసీని అనుమతి కోరడం ఏంటని తెలుగుదేశం నేత కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. ఇప్పుడు డబ్బులు వేయడానికి అనుమతి అడుగుతారా అంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రభుత్వ డబ్బులతో ఓట్లు కొనాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అసలు డబ్బులే లేనప్పుడు జగన్ బటన్ ఎందుకు నొక్కారని నిలదీశారు.
ఎలాగూ ఒప్పుకోదు కాబట్టి ఈసీపై నెపం వేసేందుకేనా అంటూ ధ్వజమెత్తారు. అసలు డబ్బు ఉందా లేదా అనేది జగన్ స్పష్టం చేయాలన్నారు. మార్చిలో నొక్కిన బటన్ డబ్బులు ఇప్పుడు వేసేదేందని ప్రశ్నించారు. ఈసీ, చంద్రబాబుపై నెపం వేసేందుకే జగన్ నాటకాలాడుతున్నారని విమర్శించారు.
జగన్ 144 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు: కనకమేడల - Kanakamedala Ravindra on CM Jagan