Kakatiya Thermal Power Plant Create New record in Telangana: తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, గణపురంలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటు (కేటీపీపీ) 202 రోజులు నిరంతరాయంగా విద్యుత్తు ఉత్పత్తిని సాధించి కీలక మైలురాయిని అధిగమించింది. ఇందులో మొదటి యూనిట్ 500, రెండో యూనిట్ 600 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ఈ విద్యుత్తు కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంటు 2023 డిసెంబరు 15 నుంచి ఈ నెల 4 వరకు నిరంతరాయంగా 202 రోజులు నడిచి 85.36 శాతం పీఎల్‌ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సాధించింది.
దీంతో కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటు ప్రభుత్వరంగ విద్యుత్తు కేంద్రాల్లో 600 మెగావాట్ల విభాగంలో దేశంలోనే ఎక్కువ రోజుల పాటుగా నడిచిన యూనిట్‌గా నిలిచింది. 202 రోజుల్లో ఈ యూనిట్‌లో సుమారు 2,460.2 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగిందని విద్యుత్ ప్లాంట్ అధికారులు తెలిపారు. గతంలో మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని ఎస్టీపీపీలోని 600 మెగావాట్ల యూనిట్ 194 రోజులు నిరంతరాయంగా నడిచిందని పేర్కొన్నారు. ఆ రికార్డును కేటీపీపీ తిరగరాస్తూ 202 రోజుల పాటుగా నిరంతరాయంగా పని చేసిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా నిలిచింది.
2009 సంవత్సరంలో కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రారంభమైంది. మొదటి యూనిట్‌లో రోజుకు 12 మిలియన్ యూనిట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తిని చేస్తోంది. 2016లో ప్రారంభమైన రెండో యూనిట్లో రోజుకు 14.4 మిలియన్ యూనిట్ల చొప్పున ఉత్పత్తి జరుగుతోంది. విద్యుదుత్పత్తికి రోజుకు దాదాపు 16 వేల టన్నుల బొగ్గు అవసరం అవుతుంది. కాగా, జెన్‌కోకు కేటాయించిన తాడిచర్ల ఓసీపీ నుంచి 8 వేల టన్నులతో పాటుగా భూపాలపల్లి, ఇతర ప్రాంతాల నుంచి సింగరేణి ద్వారా మరో 8 వేల టన్నుల బొగ్గు సరఫరా అవుతోంది. ఈ ప్రాజెక్టుకు కాళేశ్వరం నుంచి సుమారు 53 కి.మీ. మేర 2 పైపులైన్ల ద్వారా రోజుకు 8 లక్షల లీటర్ల గోదావరి జలాలను తరలిస్తున్నట్లు కేటీపీపీ అధికారులు తెలిపారు.
కూలిపోయే స్థితిలో వంశధార కుడికాలువ వయాడక్ట్ - Vamsadhara right canal damage
అమరావతి మహానగరికి ఓఆర్ఆర్ హారం- రాష్ట్రంలో ఇక భూములు బంగారం - Amravati Ring Road Project