Kadapa YSRCP Leader Srinivas Reddy Murder Case : గత ఏడాది జూన్ 23న పట్టపగలు కడప సంధ్యా సర్కిల్లో జిమ్ నుంచి బయటికి వస్తున్న వైఎస్సార్సీపీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డిని ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నడిరోడ్డుమీద నరికి చంపారు. హతుడు మాజీ ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డికి ప్రధాన అనుచరుడు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కడప, కమలాపురం నియోజకవర్గాల్లో విపరీతంగా భూ దందాలు, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు కబ్జాలు జరిగాయి.
కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాలు చెప్పినట్లు శ్రీనివాస్ రెడ్డి రెండు నియోజకవర్గాల్లో భారీగా సెటిల్ మెంట్లు, భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సెటిల్ మెంట్లు, పంచాయితీలు చేసిన వ్యవహారంలో శ్రీనివాస్ రెడ్డి కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టారు. వైఎస్సార్సీపీకి చెందిన ఆ నలుగురు ముఖ్యనేతల ఆస్తులన్నీ బినామీ కింద శ్రీనివాస్ రెడ్డి పేరుతో ఉన్నాయనే అభియోగాలు కూడా ఉన్నాయి.
ఇదే వ్యవహారంలో సెటిల్మెంట్ల డబ్బు కారణంగా వచ్చిన తేడాలతో శ్రీనివాస్ రెడ్డి కింద పని చేసే ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి హత్య చేశాడని పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ప్రతాప్ రెడ్డితో సహా ఆరుగురిని కడప పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హత్యకు ఆర్థికంగా సాయం చేసిన, ఓ పెట్రోలు బంకులో కుట్ర పన్నిన అసలు నిందితులను పోలీసులు వదిలేశారు. హతుడి భార్య మౌనిక పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా కడప వన్ టౌన్ పోలీసులు పట్టించుకోలేదు. ఈ హత్య కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు ఎల్లపుడు వెన్నంటి ఉండే వైఎస్సార్సీపీ నాయకుడు పెట్రోలుబంకు నిర్వహిస్తున్న రామ్మోహన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది.
ఇతనిపై ఏడాది కిందట పలు అభియోగాలు వచ్చినా పోలీసులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి హత్యకు పెట్రోలు బంకులోనే కుట్ర జరిగిందని సమాచారం. ఏడాది కిందట ఎస్పీగా ఉన్న అన్బురాజన్ సూచనల మేరకు డీఎస్పీ షరీఫ్, సీఐ అశోక్ రెడ్డి భారీగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో లక్షల రూపాయలు చేతులు మారడంతో అసలు కుట్రదారులను అరెస్ట్ చేయకుండా వదిలేశారనే విమర్శలు ఉన్నాయి. రామ్మోహన్ రెడ్డితోపాటు గుంటి నాగేంద్ర, మల్లేశ్, రవి పేర్లను శ్రీనివాస్ రెడ్డి భార్య మౌనిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ పోలీసులు ఈ నలుగురు అనుమానితులను అరెస్ట్ చేయకుండా వదిలేశారు.
ఈ నలుగురు అనుమానితుల పేర్లు బయటికి రాకుండా మరో నలుగురు ముఖ్య వైఎస్సార్సీపీ నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. ఈ నలుగురు భూదందాలతోనే శ్రీనివాస్ రెడ్డి బలయ్యాడని కడపలో కరపత్రాలు కూడా వేశారు. ఇలాంటి సమయంలో మౌనికను ఆదుకోవాల్సిన వైఎస్సార్సీపీ నాయకులు ఏడాది నుంచి కనీసం పట్టించుకోలేదు.
సీబీఐ కోర్టుకు అవినాష్- వివేకా హత్య కేసు విచారణ వాయిదా - Viveka Murder Case
గత్యంతరం లేని పరిస్థితుల్లో నిస్సహాయురాలిగా ఉన్న మౌనిక ప్రభుత్వం మారగానే కడపకు చెందిన టీడీపీ నేతల సహకారంతో డీజీపీని కలిశారు. కమలాపురం నియోజకవర్గానికి చెందిన మౌనిక ఇటీవల కొత్త డీజీపీని కలిసి తన భర్త హత్యకేసులో అసలు సూత్రధారులు, కుట్ర ధారులు వివరాలు పోలీసుల వ్యవహార శైలిని డీజీపీకి వివరించారు. దీంతో వెంటనే ఆయన కేసును సీఐడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రెండురోజుల కిందటే తిరుపతి నుంచి వచ్చిన సీఐడీ అధికారులు మౌనికను కలిసి ప్రాథమికంగా వివరాలు సేకరించుకుని వెళ్లారు. మరో రెండురోజుల్లో కడప వన్ టౌన్‌కు వచ్చి కేసు వివరాలను తీసుకునే వీలుందని తెలుస్తోంది. అసలు కుట్రధారులను అరెస్ట్ చేస్తేనే తన భర్త హత్యకు న్యాయం జరుగుతుందని మౌనిక అంటున్నారు.
శ్రీనివాస్ రెడ్డి హత్యకేసు సీఐడీకి అప్పగించడంతో వైఎస్సార్సీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. కేసు నుంచి తప్పించుకున్న అనుమానితులు, తప్పించిన పోలీసుల బండారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉండటంతో ఎపుడు ఏం జరుగుతుందోననే ఆందోళన జిల్లాలో నెలకొంది.