PC Ghosh Commission Inquiry Update : కాళేశ్వరంపై న్యాయ విచారణను జస్టిస్ పీసీఘోష్ కమిషన్ మరింత వేగవంతం చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి మంత్రివర్గం చేసిన తీర్మానాలతో సహా క్యాబినెట్ రూల్‌బుక్ అందజేయాలని రాష్ట్ర సర్కార్‌ను కమిషన్ కోరినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్టలో ఓ బ్లాక్ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీ నేపథ్యంలో ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించిన విషయం విదితమే.
దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్, ఇందులో భాగస్వాములైన ఇంజినీర్లు, అధికారులను విచారించి అఫిడవిట్లు తీసుకుని, వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టారు. తెలంగాణ ఇంజినీరింగ్ రీసెర్చి ల్యాబొరేటరీకి చెందిన ఆరుగురు ఆఫీసర్లను శుక్రవారం క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మరోవైపు కీలకమైన వివరాలను సేకరించే పనిలో కమిషన్ నిమగ్నమైనట్లు తెలిసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పునరాకృతి ద్వారా కాళేశ్వరంను చేపట్టడంతో పాటు ప్రాణహిత ప్రాజెక్టును ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పరిమితం చేసిన విషయం విదితమే.
Kaleshwaram Project investigation : ఇందుకు సంబంధించి క్యాబినెట్ చేసిన తీర్మానాల వివరాలను కోరినట్లు తెలిసింది. దీంతోపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులకు సంబంధించి కూడా తీర్మానాలను కోరినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అయితే దీనిపై తమకు సమాచారం లేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫైనల్ రిపోర్ట్ త్వరగా అందేలా చూడటంతో పాటు, గతంలో నీటిపారుదలశాఖ నుంచి కోరిన సమాచారం కూడా ఇవ్వాలని పీసీ ఘోష్ కమిషన్ కోరినట్లు తెలిసింది. గురువారం జస్టిస్ ఘోష్ నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో భేటీ అయ్యారు.
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి రావలసిన సమాచారం గురించి చర్చకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర సర్కార్ అన్ని రికార్డులను అందజేయాలని రెండు నెలల కిందట కమిషన్ కోరిందని, దీనిపై నీటిపారుదలశాఖ కార్యదర్శి ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు లేఖ రాసి సమాచారం ఇమ్మన్నట్లు సమాచారం అందింది తప్ప, కోరిన వివరాలు ఇప్పటివరకు అందించలేదని కూడా కమిషన్ గవర్నమెంట్ దృష్టికి తెచ్చినట్లు తెలియవచ్చింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌కు కూడా తాజాగా ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది.
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై కూడా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని కోరగా ఇప్పటివరకు రాలేదని పేర్కొన్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి జరిగిన అక్రమాలు, సర్కార్ నిధుల దుర్వినియోగం ఇలా అన్ని అంశాలపైన ఉన్న రికార్డులన్నీ అందజేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.
అఫిడవిట్లు ఇచ్చిన అందరినీ క్రాస్ ఎగ్జామినేషన్ : విచారణలో భాగంగా సుమారు 65 మంది అధికారులు న్యాయవిచారణ కమిషన్ ఎదుట అఫిడవిట్లు దాఖలు చేశారు. ఇందులో ఇంజినీర్లతో పాటు ఐఏఎస్ అధికారులు, గుత్తేదారులు పలువురు ఉన్నారు. మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కూడా ఇటీవల అఫిడవిట్ ఇచ్చినట్లు తెలిసింది. వీరందరినీ క్రాస్ ఎగ్జామినేషన్‌కు పిలవనున్నట్లు సమాచారం. వీరు ఎక్కువమంది ఉన్న నేపథ్యంలో కమిషన్ ఓ న్యాయవాదిని కూడా నియమించుకొనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేసిన ఇంజినీర్ల వివరాలను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోరింది. 2015 నుంచి ఇప్పటివరకు పనిచేసిన చీఫ్ ఇంజినీర్లు, ఎస్‌ఈలు, ఈఈ, డీఈఈ, ఏఈఈ, ఏఈల వివరాలను తక్షణమే ఇవ్వాలని ఈఎన్‌సీ(పరిపాలన)కి సూచించింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ అదనపు కార్యదర్శి ఎన్.శంకర్ ఆర్డర్స్ జారీ చేశారు. మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్ నేపథ్యంలో ఈ వివరాలు అడిగినట్లు తెలిసింది.