Justice PC Ghose Told Kaleshwaram Engineers to Submit Affidavit : మేడిగడ్డ సహా కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై ఇంజనీర్లు అందరూ ఈ నెల 25వ తేదీలోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని విచారణ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. విచారణ ప్రక్రియలో భాగంగా కమిషన్ ముందు ఇవాళ నీటిపారుదల శాఖకు చెందిన 20 మందికి పైగా ఇంజినీర్లు హాజరయ్యారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణం, నాణ్యతా నిర్వహణ, డ్యాం సేఫ్టీ ఇంజినీర్లు ఇందులో ఉన్నారు. డిజైన్లు, అధ్యయనాలు, గమనించిన అంశాలు, తీసుకున్న చర్యలు, తదితరాల గురించి ఇంజినీర్లను విచారణ చేశారు. కమిషన్ ముందు చెప్పిన అంశాలను అఫిడవిట్ల రూపంలో దాఖలు చేయాలని కమిషన్ ఇంజినీర్లను ఆదేశించింది. మూడు ఆనకట్టల బాధ్యతలు చూసిన ఇంజినీర్ల విచారణ జరుగుతోందన్న జస్టిస్ పీసీ ఘోష్, ఇంజినీర్లు అందరినీ ఈ నెల 25వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పారు.
Kaleshwaram Judicial Commission : అఫిడవిట్ ద్వారా అయితే అన్ని అంశాలు రికార్డు అవుతాయని అన్నారు. బ్యారేజీల విషయంలో లెక్కలు ఎక్కడో తప్పినట్లు కనిపిస్తోందన్న జస్టిస్, సమస్యలు రాకపోయి ఉంటే ప్రజలకు చాలా ఉపయోగపడేవని పేర్కొన్నారు. లోపం ఎక్కడుంది, ఏం జరిగిందన్న విషయమై తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఎవరి ప్రమేయం అయినా ఉందా అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు జస్టిస్ ఘోష్ తెలిపారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలుస్తామని అన్నారు.
ఈ విచారణలో భాగంగా డ్యాం సేఫ్టీ చట్టానికి లోబడి తీసుకున్న చర్యలు, సూచనలను కూడా ఇంజినీర్ల ద్వారా తీసుకుంది. ఇదే సమయంలో ఆయా సందర్భంగా నిర్మాణ సంస్థ, నీటిపారుదలశాఖ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, పైఅధికారులతో సంప్రదింపులు, వారి ఆదేశాల అమలు సహా సంబంధించిన అంశాలపై కూడా కమిషన్ ఇంజినీర్లను ప్రశ్నించింది. సమస్యలు తలెత్తినప్పటికీ మరమ్మత్తులు ఎందుకు చేయలేదని, అందుకు గల కారణాలపై కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో ఇంజినీర్లను ఆరా తీసింది.