Junior Doctors Call Off Strike in Telangana : తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్న జూడాలు సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. డీఎంఈ, ఆరోగ్యశాఖ అధికారులతో అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో సమ్మెకు విరామం ప్రకటించారు. అయితే ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవన ఏర్పాటుపై మాత్రం ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో అక్కడ సమ్మె కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు అర్ధరాత్రి వరకు జరిపిన చర్చల్లో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూడాల వసతి భవనాల నిర్మాణానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. వసతి భవనాలకు నిధులు విడుదల చేస్తామని పేర్కొంది. కాకతీయ వర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధుల మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చింది. నేడు రెండు జీవోలు విడుదల చేస్తామని జూడాలకు హామీ ఇచ్చింది. జూడాలకు ఇచ్చిన 3 హామీల సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఈ క్రమంలోనే ఉస్మానియా, గాంధీ జూడాల వసతిగృహాల నిర్మాణానికి సర్కార్ జీవో విడుదల చేసింది. కాకతీయ వైద్య కళాశాలలో రహదారుల పునరుద్ధరణకు నిధుల విడుదలు మంజూరు చేస్తున్నట్లు జీవో విడుదల చేసింది. ఉస్మానియా, గాంధీ, కాకతీయ వర్సిటీలకు రూ.204.85 కోట్లు కేటాయించింది. ఉస్మానియా వసతి భవనాలు, రోడ్లకు రూ.121.90 కోట్లు, గాంధీ ఆస్పత్రికి రూ.79.50 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. కాకతీయ వర్సిటీలో సీసీ రోడ్లకు రూ.2.75 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
'గత ఆరు సంవత్సరాల నుంచి ఉస్మానియా ఆసుపత్రిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకుంది. అక్కడ విధులు నిర్వహించాలంటే ఇబ్బందిగా ఉంది. భవనం పెచ్చులు ఊడిపడుతున్నాయి. తద్వారా డాక్టర్లు, రోగులకు గాయాలవుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకున్నాం. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. మా సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తాం. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెలా స్టైఫండ్ చెల్లింపు సహా ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి. వైద్యులపై దాడుల విషయంలో సరైన చర్యలు తీసుకోవాలి.'- ఉస్మానియా జూడాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కాలేజీల నుంచి వచ్చిన జూడాలు గాంధీ ఆసుపత్రిలో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో భేటీకి ముందు అంతర్గత చర్చలు జరిపారు. అనంతరం మరోవైపు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో జూడాలతో చర్చలు జరపనున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెలా స్టైఫండ్ చెల్లింపు సహా ఎనిమిది ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు ఇటీవల సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.
వైద్యారోగ్య మంత్రితో చర్చలు విఫలం- కొనసాగుతున్న జూడాల సమ్మె - judas protest in Telangana
'రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్న జూడాల సమ్మె' - JUNIOR DOCTORS STRIKE IN TELANGANA