JEE Advanced Exam Only 2 Times for Year : ఐఐటీల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్-2025 నుంచి మూడు సార్లు రాసుకోవచ్చని ఇటీవల ప్రకటించిన నిర్ణయంపై జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) యూ టర్న్ తీసుకుంది. గతంలో మాదిరిగానే వరుసగా రెండు సార్లు మాత్రమే పరీక్షకు అనుమతి ఉంటుందని ఈ నెల 15న జరిగిన జేఏబీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఐఐటీ కాన్పుర్ ప్రకటించింది.
ఐఐటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి 2013 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ పేరిట పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దానికి ఇంటర్ పాసైన సంవత్సరంతో పాటు ఆ తర్వాత ఏడాది అంటే వరుసగా రెండుసార్లు మాత్రమే హాజరు కావొచ్చు. దాన్ని మూడుసార్లకు పెంచుతూ జేఈఈ అడ్వాన్స్‌డ్ నిర్వహణ బాధ్యత తీసుకున్న ఐఐటీ కాన్పుర్ ఈ నెల 5వ తేదీన ప్రకటించింది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే విద్యార్థులకు అలర్ట్ - ఈ లేటెస్ట్ అప్డేట్ తెలుసుకున్నారా?
పట్టుమని 15 రోజులు కాకముందే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. దీంతో గతంలో మాదిరిగానే రెండు సార్లు మాత్రమే ఈ పరీక్ష రాసుకోవచ్చు. వచ్చే మే నెలలో జరిగే అడ్వాన్స్‌డ్ పరీక్షకు 2024 మార్చి, 2025 మార్చిలో జరిగే ఇంటర్ లేదా తత్సమానమైన పరీక్షల్లో పాసైనవారు మాత్రమే అర్హులు. అంతకంటే ముందు ఉత్తీర్ణులైనవారికి అవకాశం ఉండదు.