Jayaho Bharat Art Competition in Vijayawada: కొండలు కనువిందు చేస్తాయి. నదులు నాట్యమాడుతాయి. పల్లె పులకరిస్తుంది. ప్రకృతి పరవశిస్తుంది. మనసు తన్మయం చెందుతుంది. ఇవన్నీ చిత్రకారులు ఊహించే వేసే చిత్రకళలో ఉట్టిపడతాయి. ఆలోచనలకు అద్భుత రూపమిచ్చి చూపరులను మైమరిపిస్తాడు చిత్రకారుడు. ఆలాంటి నైపుణ్యాలకు ఊతమిచ్చేందుకు ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన జయహో భారత్ ఆర్ట్ కాంటెస్టు వేదికైంది.
అద్భుత చిత్రాలకు ఆలోచనలే సోపానాలు. అలాంటి చిత్రలేఖనంలో తమదైన ప్రతిభ చాటారీ విద్యార్థులు. కళానైపుణ్యంతో బొమ్మలకు ఆకారన్నిచ్చి కట్టిపడేస్తున్నారు. విద్యార్థుల్లోని చిత్రకళా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు వేదికైంది విజయవాడలో జరిగిన జయహో భారత్ ఆర్ట్ కాంటెస్ట్. ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కృష్టా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన సుమారు 12వందల మంది విద్యార్థులు చిత్రలేఖనంతో ఆకట్టుకున్నారు.
రెండేళ్లుగా జయహో భారత్- భారతీయుడిగా నేను గర్విస్తున్నాను. అనే పేరుతో చిత్ర లేఖనం పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. చదువుతో పాటు ఇలాంటి కళాత్మక పోటీల్లో పాల్గొని దేశ నాయకుల చిత్రాలు వేయడం తమకెంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని విద్యార్థులు చెబుతున్నారు.
1 నుంచి 3వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 'భారతదేశంలో నాకు నచ్చిన ప్రదేశం' అనే అంశంపై పోటీ నిర్వహించారు. 4 నుంచి 6వ తరగతి విద్యార్థులకు భారతదేశ సంస్కృతి, 7 నుంచి 10వ తరగతి వాళ్లకు 'భారత దేశం నా స్వర్గసీమ' అనే పేరుతో చిత్రాలు వేయించారు. ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు 'పురోగమన వైతాళికుల పోట్రయిట్ చిత్రాలు' అనే అంశంపై పోటీలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
జయహో భారత్ ఆర్ట్ కాంటెస్ట్ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. చదువుతో పాటు ఇలాంటి కళారంగాల్లో రాణిస్తే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.
"మాలో ఉన్న ప్రతిభను పెంపొందించేందుకు ఈ జయహో భారత్ ఆర్ట్ కాంటెస్టు చాలా ఉపయోగపడింది.చదువుతో పాటు ఇలాంటి కళాత్మక పోటీల్లో పాల్గొని దేశ నాయకుల చిత్రాలు వేయడం మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది." - పోటీలో పాల్గొన్న విద్యార్థులు