Driverless E-Tractor Innovation in Telangana : వ్యవసాయ పనుల కోసం డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా విద్యుత్ లేదా బ్యాటరీ సాయంతో నడిచే ట్రాక్టర్ ఇది. హైదరాబాద్ శివారు చర్లపల్లిలో జయ భారత్ ఎక్విప్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ట్రాక్టర్‌ను ఆవిష్కరించింది. కంపెనీ యజమాని నలమల వెంకట నరసింహా రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో వాడుకోవడానికి వీలుగా ఆటోమేటిక్ మినీ ట్రాక్టర్లును తయారు చేశారు. రూ.7 లక్షల వ్యయంతో ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి, మరో రూ.3 లక్షలు వెచ్చించారు. 6 మాసాల పాటు పరిశోధించి ప్రయోగాత్మకంగా ఎప్పటికప్పుడు సవరించుకుంటూ డ్రైవర్ రహిత ట్రాక్టర్‌ను అందుబాటులోకి తెచ్చారు.
సాధారణ ట్రాక్టర్‌కు ఉన్న డీజిల్ ఇంజిన్‌ను తీసివేసి, 415 ఓల్ట్‌ల 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్‌ను జత చేశారు. కేబుల్ గైడ్ అమర్చి, 100 మీటర్ల 4 కేబుల్‌తో రీలింగ్ డ్రమ్ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ఛార్జర్ గ్రిడ్ పవర్, బ్యాటరీ పవర్ మోడ్‌లో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఉంది. మధ్య తరహా ట్రాక్టర్ 9 గంటలు పని చేస్తే 40 నుంచి 50 లీటర్ల డీజిల్‌కు రూ.4 వేల నుంచి రూ.5 వేలు ఖర్చవుతుంది. అదే సామర్థ్యం గల ఎలక్ట్రిక్ ట్రాక్టర్ 120 నుంచి 140 యూనిట్ల శక్తిని వినియోగిస్తుంది. దీంతో సాగుకు విద్యుత్ రాయితీ వల్ల ఇంధన ఖర్చు గణనీయంగా తగ్గుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాములు, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ట్రాక్టర్ పని తీరు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ ట్రాక్టర్‌ను తయారు చేసిన నిజామాబాద్ జిల్లాకు చెందిన నలమల వెంకట నరసింహా రెడ్డి సింగరేణి కాలరీస్‌లో ఇంజినీర్‌గా వివిధ హోదాల్లో పని చేశారు. పదవీ విరమణ అనంతరం హైదరాబాద్‌లో సొంతంగా జయ భారత్ ఎక్విప్‌మెంట్ నెలకొల్పి సింగరేణి గనులకు భూగర్భ ఎలక్ట్రికల్ యంత్రాలు అందజేస్తున్నారు. ప్రస్తుతం ట్రాక్టర్‌కు సంబంధించి పేటెంట్ దరఖాస్తు చేసినట్లు వెంకట నరసింహా రెడ్డి తెలిపారు.
రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో నేను ఈ ట్రాక్టర్‌ను రూపొందించాను. 3 నెలల కాలంలోనే దీన్ని పూర్తి చేశాం. డీజిల్‌కు బదులుగా విద్యుత్, బ్యాటరీ రెండింటితో ఈ ట్రాక్టర్ నడుస్తుంది. దీనిపై మేము పేటెంట్ హక్కులకు దరఖాస్తు చేశాం. భవిష్యత్తులో ట్రాక్టర్ కంపెనీలతో కలిసి మరిన్ని రూపొందిస్తా. - నలమల వెంకట నరసింహా రెడ్డి, భారత్ ఎక్విప్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ
సిద్దిపేట యువకుడి వినూత్న ఆవిష్కరణ - ఇకపై పొలంలోనే బియ్యం ఉత్పత్తి! - a Man Makes Harvester Mission
చేనేత కష్టాలకు చెక్ పెట్టేలా సిరిసిల్ల విద్యార్థి అద్భుత ఆవిష్కరణ