Pawan Kalyan Pithapuram Meeting: అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్, భవిష్యత్తు తరాల కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో పవన్ కల్యాణ్ రోడ్ షో నిర్వహించారు.
ఈ ఎన్నికలు రాష్ట్ర దశ, దిశను మార్చే ఎన్నికలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో సాగు, తాగునీరు, రోడ్లు, రైతులకు మద్దతు ధర దక్కలేదని విమర్శించారు. ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేకపోయారని ఆరోపించారు. కొత్త ఉద్యోగాలను సృష్టించలేకపోయారని అన్నారు. మహిళలకు భద్రత లేదని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చారు.
25 ఏళ్ల భవిష్యత్తు కోసం జరిగే ఎన్నికలు ఇవి అని పవన్ పేర్కొన్నారు. దేశంలో మన రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉండాలని ఆకాంక్షించారు. ఉప్పాడ బీచ్‌ను అభివృద్ధి చేస్తానని, పర్యాటకులు వచ్చేలా చూస్తానని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిదన తరువాత సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తామని, ఇంటింటికీ తాగునీరు ఇస్తామన్నారు. పిఠాపురంలో డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉందని గుర్తించాలన్న పవన్ కల్యాణ్, జనసేన ప్రశ్నించాకే ప్రభుత్వం రోడ్లు వేసిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే రోడ్లు వేస్తామని, పిఠాపురంలో విద్య, వైద్య, ఉపాధి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
అన్ని వర్గాలు వైఎస్సార్సీపీని భూస్థాపితం చేస్తాయి: పవన్ - JANASENA PAWAN KALYAN INTERVIEW
కాకినాడ సెజ్ లో పిఠాపురం, కాకినాడ యువతకు దక్కాల్సిన ఉద్యోగాలు దక్కేవరకు పోరాడతానని పవన్ హామీ ఇచ్చారు. యువతకు ఉపాధి కల్పనతో సహా విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తానన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం గాజు గ్లాసుకు, కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. రోడ్ షోలో అడుగడుగునా పవన్‌కు మూడు పార్టీల శ్రేణులు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
నేటి సభపై సర్వత్రా ఉత్కంఠ: మెగాస్టార్ చిరంజీవి తనయుడు, సినీ నటుడు రామ్‌చరణ్ నేడు పిఠాపురం వస్తున్నారు. తల్లి సురేఖతో కలిసి పాదగయ క్షేత్రాన్ని సందర్శించి పూజలు నిర్వహిస్తారు. అనంతరం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ కానున్నారు. మరోవైపు పవన్‌కల్యాణ్ నేడు కాకినాడలో తలపెట్టిన సభపై ఉత్కంఠ నెలకొంది. పవన్ రోడ్‌షో, సభకు అనుమతి ఇవ్వాలని ఈ నెల 8వ తేదీన టీడీపీ నేతలు పోలీసులకు లేఖ ఇచ్చారు.
అదేరోజు వైసీపీ అభ్యర్థి ర్యాలీలు నిర్వహించడానికి అనుమతులు తీసుకున్నారని, శాంతిభద్రతల సమస్యల నేపథ్యంలో పవన్ సభకు అనుమతి ఇవ్వడంకుదరదని ఆర్వోకి కాకినాడ డీఎస్పీ గురువారం లేఖ పంపారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ సభ, రోడ్‌షోకు అనుమతి ఇవ్వాలని టీడీపీ నేతలు కలెక్టర్‌ను కోరారు. అనుమతి కోసం ఉదయం వరకు వేచి చూస్తామని, ఎలా అయినా సరే సభ పెట్టి తీరతామని స్పష్టంచేశారు.
నేడు పిఠాపురంలో జగన్ పర్యటన: ఎన్నికల ప్రచారం చివరి రోజు వైసీపీ అధినేత జగన్ పిఠాపురంలో తన షెడ్యుల్ పెట్టుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం నియోజకవర్గం కేంద్రంలో ఉప్పాడ బస్ స్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
యువత ఆశలు, ఆకాంక్షలను అసెంబ్లీలో వినిపిస్తా: పవన్ కల్యాణ్ - Pawan Kalyan Varahi Meeting