JD Lakshmi Narayana Complaint to CP : జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం విశాఖ పోలీస్ కమీషనర్ ఎ. రవిశంకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని సీపీని జేడీ కోరారు.
ఎమ్మెల్యే అభ్యర్థిగా లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు : లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీకి జేడీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. తనను అంతమొందించేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఎంపీ అభ్యర్థిగా జనసేన తరపున పోటీ : గత ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ జనసేన తరపున విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. లక్ష్మీనారాయణ పార్టీకి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కామన్ సింబల్‌గా టార్చిలైట్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
పార్టీ స్థాపన : గత ఎన్నికల్లో పోటీ తర్వాత మరింత స్ఫూర్తితో పని చేశానని, అన్ని వర్గాల ప్రజలను కలిసి అభిప్రాయాలు తీసుకున్నట్టు గతంలో లక్ష్మీనారాయణ వెల్లడించారు. రాజకీయాలు అంటే మోసం కాదు సుపరిపాలన అని, రాష్ట్రంలో నిరుద్యోగానికి ప్రధాన కారణం ప్రత్యేక హోదా రాకపోవడమే అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో అన్ని పార్టీలూ విఫలమయ్యాయని, ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ (JBNP) అని లక్ష్మీనారాయణ వెల్లడించారు.
అందరూ ఉద్యమిస్తే ప్రత్యేక హోదా కచ్చితంగా సాధిస్తాం: జేడీ
జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో : జై భారత్ నేషనల్ పార్టీ ప్రజా మేనిఫెస్టోలో పారదర్శకత, సుపరిపాలన, వ్యవసాయం, విద్య, గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారత, మద్యపాన నిషేదం వంటి అనేక అంశాలతో రూపొందించినట్టు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాజకీయ స్వలాభాన్ని విడనాడి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం తమ పార్టీ తీసుకున్న నిర్మాణత్మక నిర్ణయాలు ఈ ప్రజా మేనిఫెస్టోలో ఉన్నాయని వెల్లడించారు. తమ మేనిఫెస్టో ప్రజాదరణ పొందెలా రుపొందించామని లక్ష్మీ నారాయణ తెలిపారు. కరెంటు, మౌళిక సదుపాయాలు, నదుల అనుసంధానం, ఉద్యోగుల సంక్షేమం, రాష్ట్రానికి వనరులు ఎలా తీసుకురావాలి వంటి మరిన్ని అంశాలను క్షేత్రస్ధాయిలో పరిశీలన చేసి ఈ మేనిఫెస్టోను రుపొందించామని స్పష్టం చేశారు.
రాష్ట్రాభివృద్ధి, ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా జై భారత్ మేనిఫెస్టో: లక్ష్మీనారాయణ