YS Jagan Mohan Reddy Resign As CM: ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురవడంతో వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. పరాభవంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈసీ డిక్లరేషన్ అనంతరం గవర్నర్‌కు రాజీనామా లేఖను పంపారు. ఫలితాల అనంతరం స్పందించిన జగన్ ఇంతటి పరాబవాన్ని ఊహించలేదన్నారు. ఫలితాలు తమను ఆశ్చర్యానికి గురిచేశాయని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఫలితాలను ఊహించలేదన్నారు. అక్క చెల్లెమ్మల ఓట్లు ఎటు పోయాయో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. పింఛన్లు అందుకున్న అవ్వా తాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు.
రాజీనామా ఆమోదించిన గవర్నర్ : సీఎం జగన్ రాజీనామాపై రాజ్‌భవన్ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించిన నేపథ్యంలో 04.06.2024 నుండి అమల్లోకి వచ్చేలా రాజీనామాను ఆమోదించారు. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు జగన్ మోహన్ రెడ్డి పదవిలో కొనసాగాలని జగన్‌కు సూచించారు.
హలో ఏపీ.. బైబై వైసీపీ అంటూ తీర్పు ఇచ్చిన ఓటర్లు, జిల్లాలకు జిల్లాలనే కూటమికి కట్టబెట్టారు. ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో ఒక్కసీటు ఖాతా తెరవకుండానే వైఎస్సార్సీపీ డకౌట్ అయ్యింది. ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో వైఎస్సార్సీపీ కనీసం ఖాతా తెరకపోవడం ఆ పార్టీ శ్రేణులను కలరపాటుకు గురిచేసింది. శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలను స్వీప్ చేసింది. మొత్తం 175 స్థానాలకు గాను 165 స్థానాలు గెలిచిన కూటమి గెలుచుకుంది. వైఎస్సార్సీపీ కేవలం 10 స్థానాలకు పరిమితమైంది. ఒకనొక దశలో వైఎస్సార్ సీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందన్న ఊహాగానాలు వెలువడ్డాయి.
పోటీ చేసిన మొత్తం 21 స్థానాల్లోనూ గెలిచిన జనసేన, రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. కూటమిలో తమకు కేటాయించిన సీట్లలో మొత్తం గెలిచి విజయ దుందుభి మోగించి, సత్తా చాటింది. పోటీ చేసిన 10 స్థానాలకు గాను బీజేపీ 8 గెలిచింది. జనసేన రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. వైఎస్సార్సీపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. జగన్, పెద్దిరెడ్డి మినహా మంత్రులు, మాజీమంత్రుల ఘోర పరాజయం పొందారు. కూటమి జోరులో వైఎస్సార్సీపీ అభ్యర్థులు కొట్టుకుపోయారు. ఈ ఓటమికి బాధ్యత వహిస్తు సీఎం జనగ్ తన పదవికి రాజీనామా చేశారు.