Jagan met YSRCP Leaders at Camp Office in Tadepalli: గడచిన ఐదేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి కుటుంబానికీ, ప్రతి ఇంటికీ మంచి చేసినా, శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మరో సారి వ్యాఖ్యానించారు. ఫలితాలు చూస్తే ఇప్పటికీ ఆశ్చర్యమేస్తోందని ఆధారాలు లేనందున ఏమీ మాట్లాడలేమన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జగన్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఘోర పరాభవానికి కారణాలు ఏమిటనే విషయమై నేతల నుంచి అభిప్రాయాలు సేకరిస్తే తనను టార్గెట్ చేస్తారని ముందే ఊహించిన జగన్ దాని జోలికి పోలేదు. ఎప్పటి లాగే అందరినీ సీట్లలో కూర్చోబెట్టి, తనతో పాటు తెచ్చుకున్న స్కిప్టు చదివి వినిపించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 2.7 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చామని, ఏ పథకం ఏ నెలలో ఇస్తామో ఆ పథకానికి సంబంధించిన క్యాలెండర్ ఇచ్చి తేదీల వారీగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమచేశామని అన్నారు. అలాంటిది వారి ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. అసెంబ్లీలో వైసీపీ సంఖ్యాబలం తక్కువే కాబట్టి, అసెంబ్లీలో చేసేది తక్కువేనని, ప్రజలకు మరింత దగ్గరయ్యే కార్యక్రమాలు, ప్రజల తరపున పోరాటాలు చేస్తామన్నారు. గతంలో చంద్రబాబు వ్యవసాయరుణాల మాఫీ దగ్గర నుంచి అన్నీ చేస్తానని చెప్పి 2019 నాటికి చేయకపోవడం వల్ల ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మనల్ని అధికారంలోకి తీసుకొచ్చారని 2029 లోనూ ఇదే పునరావృతం అవుతుందన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో మేనిఫెస్టోను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించేలా చేస్తే ఇప్పుడు రెడ్ బుక్స్ అని హోర్డింగులు పెడుతున్నారని జగన్ అన్నారు. ఆ రెడ్‌బుక్‌లో ఏ అధికారిపై కక్ష సాధించాలి, ఎవరిపై దాడులు చేయాలి, ఎవరిని నాశనం చేయాలని ఏకంగా పేర్లు రాసుకుంటున్నారని అన్నారు. ప్రతి గ్రామంలోనూ వైసీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు జరుగుతున్నాయని, శిశిపాలుని పాపాలు మాదిరిగా ఈ ప్రభుత్వం పాపాలు వేగంగా పండుతున్నాయన్నారు. కేంద్రంలో బీజేపీకి మెజార్టీలేకపోయినా మద్దతిస్తోన్న చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగకపోవడం శిశుపాలుడి పాపాల్లో మరొకటన్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను రాజీనామా చేయాలంటూ బెదిరిస్తున్నారని, వారందరికీ భరోసా ఇవ్వాలని ఆదేశించారు.
బాధ్యతలు స్వీకరించిన మంత్రులు- తొలిసంతకాలు వాటిపైనే! - AP MINISTERS
నాలుగేళ్ల వరకూ అవిశ్వాసం పెట్టే అవకాశం లేదని చట్టం దీన్ని నిరోధిస్తుందని జగన్ న్నారు. ఈ చట్టాన్ని మార్చి ఏదో చేయాలనుకుంటే దానికి కోర్టులు ఒప్పుకోవని ధైర్యంగా ఉండాలన్నారు. ఇప్పటికే పార్టీ తరఫున ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నామని, పార్టీ ఇచ్చే సహాయాన్ని మీరు స్వయంగా అందించాలన్నారు. రాబోయే రోజుల్లో తాను కార్యకర్తలను కలుసుకుంటానని, నష్టపోయిన ప్రతి కార్యకర్తనూ వాళ్ల ఇంటికి వచ్చి కలిసి వారికి భరోసానిచ్చే కార్యక్రమం చేస్తాననన్నారు. మనలో నిరాశకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వకూడదని, ధైర్యంగా అడుగులు ముందుకు వేయాల్సిందేనని నేతలతో జగన్ చెప్పారు.