Jagan Govt Games with Poor People in the name of Tidco Houses: పేదల సొంతింటి కలను నిజం చేస్తామని ఐదేళ్లుగా ఊదరగొడతున్న జగన్ ఎన్నికల ముందు కూడా వారిని మోసగిస్తూనే ఉన్నారు. రాజమహేంద్రవరంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఇప్పటి వరకు లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా చుక్కలు చూపిస్తున్నారు. నేడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుండటంతో ఇళ్ల పట్టాలు ఇస్తామని హడావుడిగా రప్పించి ఉసూరుమనిపించారు. బ్యాంకు రుణాలు కట్టి, ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులు తీవ్ర వేదనతో వెనుదిరిగారు.
పేదల ఇళ్లపై పగబట్టిన జగన్ సర్కార్ - అయిదేళ్లుగా పూర్తి చేయని వైనం
రాజమేహంద్రవరం బొమ్మూరులోని టిడ్కో ఇళ్ల సముదాయంలో ఇళ్లు కేటాయిస్తాం రండి అంటూ అధికారులు, రిసోర్స్ పర్సన్లు లబ్దిదారుల ఫోన్లకు సందేశాలు పంపారు. ఉదయం 9 గంటలకల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ రావాలని ఫోన్లు చేసి చెప్పారు. ఇళ్ల కోసం ఐదేళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్న లబ్దిదారులు ఎంతో ఆశతో పనులు మానుకొని టిడ్కో గృహ సముదాయం వద్దకు తరలివచ్చారు. ఎంపీ భరత్ వచ్చి పట్టాలు పంపిణి చేస్తారని అధికారులు చెప్పడంతో ఆయన రాకకోసం ఉదయం నుంచి వేచి చూశారు. ఆయన తాపీగా మధ్యాహ్నం శిబిరం వద్దకు వచ్చి ఐదేళ్లలో అధిక సంఖ్యలో ఇళ్ల పత్రాలు పంపిణీ చేయడం వైలీపీకే చెల్లిందని ప్రసంగించారు.
నెల్లూరు జిల్లాలో పెట్రేగిపోతున్న భూ ఆక్రమణలపై వైసీపీ కౌన్సిలర్ ఆగ్రహం
ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని ఎంపీ భరత్ అన్నారు. అనంతరం కొందరికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందించి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన తర్వాత లబ్దిదారులకు పట్టాలు పంపిణీ కొందరికే చేయడంతో బాధితులు తీవ్ర ఆవేదన చెందారు. 1200 ఇళ్లకు పత్రాలు అందింస్తామని పిలిపించిన అధికారులు తీరా 322 మందికే పత్రాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా వారు శనివారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు రావాలని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వరకు మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా కూర్చోబెట్టి ఇళ్ల పత్రాలు ఇవ్వకపోవడంపై మిగతా లబ్ధిదారులు కంటతడి పెట్టుకున్నారు.
'వారం నుంచి నీళ్లు లేవు - మా కాలనీ వైపు చూడండి కొడాలి నాని గారూ'
పేదలకు ఇళ్లు కట్టిస్తున్నామంటూ ఐదేళ్లగా ఆశల పల్లకిలో ఊరేగించిన జగన్ తాని అధికారంలోకి వచ్చే సరికే టీడీపీ ప్రభుత్వంలో కట్టి ఉన్న టిడ్కో ఇళ్లపై శీతకన్ను వేశారు. టీడీపీ ప్రారంభించిన పథకం అయితే చాలు తీసేయ్ అది నిరుపేదలకు మేలు చేసేదైనా పట్టించుకోవద్దంటూ నిర్లక్ష్యం వహించారు. ప్రధానంగా టిడ్కో ఇళ్లపై జగన్ కక్షపూరిత వైఖరి మరింత ఎక్కువ చూపించారు. జగన్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వరకూ టిడ్కో ఇళ్లు అనేవి ఉన్నాయనే విషయాన్నే అసలు పట్టించుకోలేదు. ప్రతిపక్ష నేతలు పోరాటాలు, ఆందోళనలు చేసేసరికి కొన్నిచోట్ల నిర్మాణ పనులు చేపట్టి నత్తనడకన కొనసాగించారు. బడ్జెట్ నుంచి నిధులు విడుదలయ్యేలా చేయని జగన్, అప్పులు తెచ్చుకుని కట్టుకోవాలంటూ భారం మొత్తాన్ని లబ్ధిదారులపైనే వేశారు. టిడ్కో లబ్ధిదారుల్లో 90 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. పదే పదే నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ గుండెలు బాదుకొనే జగన్ టిడ్కో ఇళ్లను పూర్తిచేయకుండా పరోక్షంగా వారిపైనే కక్షసాధించారు.